రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి . కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంఘం సమంవ్యంగా నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడం ఈ శిక్షణా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవల పథకం, 2015” ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలియజేశారు. వారందరూ ఈ-శ్రమ్ పోర్టల్ లో వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 15 మంది కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం. లలిత కుమారి , ప్లమ్బర్ లు, విద్యుత్, భవన నిర్మాణ తదితర రంగాల్లోని కార్మికులు పాల్గొన్నారు.