-ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పిల్లి సుభాష్ చంద్రబోస్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అభివృద్ధి సాధిస్తేనే ప్రపంచంలో గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అందుకే ఆ దిశగా విస్తృత కృషి సాగుతోందన్నారు. ఇస్రో ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన ఇస్రో కార్యకలాపాల వివరాలు, రాకెట్స్ నమూనాల ప్రదర్శనను శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్బంగా గోదావరి జిల్లాలకు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ శ్రీహరికోటకు గతంలో సందర్శించానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇలాంటి జాతి రత్నాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భారత తొలిప్రధాని పండిట్ నెహ్రూ మొదలుకుని ప్రస్తుత ప్రధాని వరకు అందరూ అంతరిక్ష రంగం అభివృద్ధికి కృషి చేసారని, ముఖ్యంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ అందిస్తున్న సహకారం అద్వితీయమన్నారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావడంతో ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఆనందం వ్యక్తంచేసూ ఇస్రో పరిశోధనలకు ఎలాంటి సహకారం కావాలన్నా నేరుగా తనను సంప్రదించాలని సూచించారని గుర్తుచేశారు. ఒకప్పుడు రష్యా సహకారంతో రాకెట్ ప్రయోగాలు చేసిన మనం ఇప్పుడు సొంత సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేసే స్థాయికి ఎదిగామని ఆయన పేర్కొంటూ భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలను నమోదుచేస్తుందని ఆకాంక్షించారు.