Breaking News

అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

నంద్యాల జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
గాలేరు-నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు-నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్‌ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014-19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్‌ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్‌ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్‌ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ-నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్‌ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్‌ 2005లో గాలేరు-నగరి సుజల స్రవంతిని చేపట్టారు. వైఎస్సార్‌ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. దివంగత వైఎస్సార్‌ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు-నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ`నీవాను చేపట్టారు. గాలేరు`నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్‌, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు-నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు-నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్‌ చేపట్టారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించారు.
బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌ వరకూ ఉన్న లింక్‌ కెనాల్‌, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్‌ వరకు తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్‌ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్‌ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్‌ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నారు. బ్రహ్మంసాగర్‌ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *