-28వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28 వ డివిజన్ శ్రీనగర్ కాలనీలోని 212 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి కనపర్తి కొండాతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేసి, అనంతరం సచివాలయం వద్ద సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల బోర్డును ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధి గూర్చి ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో బడ్జెట్ భారీగా ఉన్నా.. ఆ నిధులన్నీ టీడీపీ నేతల జేబుల్లోకి, జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు చేరాయని ఆరోపించారు. కానీ సంక్షేమ పథకాలను అసామాన్యంగా అమలు చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. 212 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా 1,316 మందికి 4 కోట్ల 69 లక్షల 45 వేల 945 రూపాయల లబ్ధి చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 510 మందికి 3 కోట్ల 13 లక్షల 86 వేల 210 రూపాయలు మేలు కలిగించినట్లు వెల్లడించారు. మొత్తంగా 1,826 మందికి 7 కోట్ల 19 లక్షల 53 వేల 639 రూపాయల లబ్ధి కలిగించినట్లు వివరించారు. 2019 మార్చిలో తెలుగుదేశం అధికారం దిగిపోయే నాటికి ఏపీ వృద్ధిరేటు పరంగా దేశంలో 16వ స్థానంలో ఉండేదని.. కానీ ఈ నాలుగున్నరేళ్లలో 50 శాతం GSDP వృద్ధిని నమోదు చేసి 4వ ర్యాంక్ కి చేరుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనే మేటిగా నిలిపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.