-శాఖల సమన్వయంతో పరేడ్‌కు సిద్దం కండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సమైక్యత ఉట్టిపడే విధంగా గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి ప్రాంగణాన్ని సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 75వ గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత ఉట్టిపడే విధంగా వేడకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పరేడ్‌కు సిద్దంగా ఉంచాలన్నారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాకావిష్కరణ చేస్తారని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొనే గణతంత్ర వేడుకలకు తగిన విధంగా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి సిద్దంగా ఉంచాలన్నారు. ప్రధాన వేదిక, వివిఐపి, విఐపి గ్యాలరీలలో ప్రోటోకాల్ మేరకు సిటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వేడకలను వీక్షించేందుకు విచ్చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గణతంత్ర వేడుకలలో పాల్గొనే కంటెంజెట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని చాటేలా వివిధ శాఖల అలంకృత శఖటాలను ముందుగానే సిద్దం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సమాచార శాఖ అధికారులకు సూచించారు. వేడుకల విషేషాలను ఎప్పటికప్పుడు అందించే వాఖ్యాతలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సును కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంపును, అంబులెన్సులను సిద్దంగా ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న గణతంత్ర వేడుకలను విజయవంతం చేయడంలో అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్దతో ఎటువంటి లోటు పాట్లకు తావులేకుండా శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
ఏర్పాట్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, పోలిస్, రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.