– అవరోధాలను అధిగమించి ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవాలి..
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విద్యార్థినులతో అన్నారు.
బుధవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, మేరీ స్టెల్లా కాలేజీ, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు.. వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి బాలికా దినోత్సవం, బాలికల హక్కుల పోస్టర్లను ఆవిష్కరించి బాలికా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికలకు, మహిళలకు బాసటగా నిలిచేలా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, లింగ వివక్షత, మానవ అక్రమ రవాణా తదితర సమస్యలను ప్రస్తావించి.. వాటి నిర్మూలనకు సమష్టి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. లింగ వివక్షతను రూపుమాపి.. సమసమాజ స్థాపన అనేది వ్యక్తి నుంచి కుటుంబం నుంచే మొదలుకావాలన్నారు. ప్రస్తుతం ఉపాధి పరంగా అమ్మాయిలకు మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని.. తమ హక్కుల గురించి తెలుసుకొని బాగా చదువుకొని ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవాలని సూచించారు. మేరీ స్టెల్లా కళాశాలలో ప్రాజెక్టు ఆధారిత విద్యా విధానానికి ప్రాధాన్యతనిస్తున్నందున గర్ల్ ఛైల్డ్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రాజెక్టులపైనా దృష్టిసారించి.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించాలని సూచించారు. ఓటు హక్కు నమోదు, ఓటు హక్కు వినియోగం, ఎథికల్ ఓటింగ్‌పైనా కలెక్టర్ డిల్లీరావు కార్యక్రమంలో మాట్లాడారు.
కళాశాల ప్రిన్సిపల్ డా. సిస్టర్ రేఖ మాట్లాడుతూ అమ్మాయిలు తమ భవిష్యత్ ప్రణాళిక, హక్కులతో పాటు జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ఛైల్డ్ హెల్ప్‌లైన్-1098, పోలీస్-100/112, ఉమెన్ హెల్ప్‌లైన్-181పైనా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, దిశ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వాసవి, ఫోరం ఫర్ ఛైల్డ్ రైట్స్ జిల్లా సమన్వయకర్త ఎ.రమేశ్, బర్డ్స్ ఎన్‌జీవో ప్రతినిధి కె.ప్రకాష్ కుమార్, కళాకారులు ఆర్.పిచ్చయ్య, కళాశాల కరస్పాండెంట్ డా. లేన క్వాడ్రాస్, సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ సిస్టర్ సహాయ మేరీ, సిస్టర్ లావణ్య, ఉషా కుమారి, డా. లిటిల్ ఫ్లవర్, స్వప్న, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News