Breaking News

నల్లజర్ల మండలస్థాయి వైసీపీ సమావేశం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు, తమకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదని… నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమయంలోనైనా తమ దృష్టికి సమస్యను తీసుకుని రావచ్చునన్నారు. శనివారం నల్లజర్లలో స్థానిక ప్రియాంక కన్వెన్షన్ లో నిర్వహించిన నల్లజర్ల మండలం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి హోంమంత్రి అధ్యక్షత వహించారు.  ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తల పరిచయ వేదికతో పాటు 2024 ఎన్నికల్లో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గ ఆడపడుచు తానేటి వనితను భారీ మెజారిటీతో గెలిపించుకుని జగన్ మోహన్ రెడ్డికి గిప్ట్ గా ఇస్తామని నాయకులు, కార్యకర్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ కంచుకోట గా ఉన్న నియోజక వర్గాన్ని 2019లోనే వైఎస్సార్సీపీ బద్దలు కొట్టిందని, 2024లో మరింత మెజారిటీతో గెలుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మేలు జరిగితేనే మళ్లీ ఆశీర్వదించమని కోరుతున్న దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని నాయకులకు  దిశా నిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను  ప్రజలకు వివరించాలన్నారు. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిద్ధం అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని.. ఫిబ్రవరి 1వ తేదీన ఏలూరులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ఏర్పాట్ల పై స్థానిక ప్రతినిధులకు, నాయకులకు మార్గ నిర్దేశం చేశారు. పుట్టింటి ఆదపడుచుగా తమ పై చూపిస్తున్న ఆదరాభిమానాలకు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు సర్వదా రుణపడి ఉంటానన్నారు. ఏ కుటుంబంలోనైనా చిన్న, చిన్న గొడవలు ఉండటం సహజమని.. వైసీపీ అనే పెద్ద కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకుంటామని తెలిపారు. పార్టీ గెలవడానికి ప్రతి గ్రామంలో కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. గోపాలపురం నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీని మళ్ళీ గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలంటే అందరం కూడా పార్టీ కోసం కష్టపడి మళ్లీ పనిచేసి అందరితో కలిసిమెలిసి వెళ్లాలని సూచించారు. తాను ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యే లేనని, జగనన్న ఆశీర్వాదంతో మళ్లీ కేబినెట్ లోకి తీసుకుంటే మీరంతా మంత్రులే అని తెలిపారు. తాను ప్రస్తుతం హోం మంత్రి స్థానంలో గోపాలపురం నియోజక వర్గం ఇంచార్జీ కాబట్టి మీరంతా హోంమంత్రి గానే భావించాలన్నారు. మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. ఈ తక్కువ సమయంలో ప్రతి ఒక్కరినీ కలిసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు  హోం మంత్రి తానేటి వనిత వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *