-ఇప్పటివరకు ప్రభుత్వానికి సహకరించాం
-వాయిదాల మీద వాయిదాలే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు
-ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ స్పందన నిరాశాజనకం
-మా సహనాన్ని పరీక్షించవద్దు… తేలికగా చూడొద్దు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్లుగా ఉద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నాయి. ఇంతకాలం సహకరించాం… మా సహనాన్ని ఈ ప్రభుత్వం తేలికగా చూస్తోంది. మా సహనం నశించింది. ఇక ఉద్యమ బాట తప్పదని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు.
గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టి ఐదేళ్లు పూర్తికావస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి ప్రభుత్వానికి పాలన, పాలనేతర అంశాలలో సంపూర్ణంగా సహకరించామన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు హక్కుగా రావలసిన డి ఎ బకాయిలను గత ఐదేళ్లలో ఒక్క డీఎ బకాయి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పి ఆర్ సి లో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ప్రతి పి ఆర్ సి లోను సాధారణంగా జీతభత్యాల పెంపు ఉంటుందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెంచకపోగా తగ్గించిందని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల కు వలసిన బకాయిల సొమ్ము సుమారు 25 వేల కోట్ల రూపాయలు పైబడి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. తమ కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు లోన్స్ పెడితే తమకు సమయానికి డబ్బు చేతికందటం లేదని వివరించారు. ఇటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న చరిత్ర గతంలో ఇప్పుడు లేదన్నారు. తమ డబ్బులకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం బాధాకరమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తమ ఆరోగ్య అవసరాల కోసం ప్రతినెల చెల్లిస్తున్న వైద్య బీమా డబ్బులు సైతం ప్రభుత్వం ఆసుపత్రుల ఖాతాలకు జమ చేయకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యాలు తమ అనారోగ్య సమస్యల సమయంలో వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నాయన్నారు. డిఏ తదితర బకాయిలు ఒక్కో ఉద్యోగికి కనీసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవ్ ల సొమ్ములు కూడా ప్రభుత్వం తనవద్దే ఉంచుకొని గత మూడు సంవత్సరాలుగా చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంద న్నారు.8 వేల కోట్లకు పైగా సరెండర్ లీవుల డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప ఒక్క ఉద్యోగికి కూడా బకాయిలు చెల్లించలేదన్నారు.
ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల పైగా సొమ్ము గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఉద్యోగులు చెల్లిస్తున్నప్పటికీ, సుమారు పదివేల కోట్ల మూలధనం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఒక్క పైసా కంట్రీ బ్యూషన్ లేకపోయినప్పటికీ. APGLi రుణాలు గాని ,రిటైర్ అయితే చెల్లించడం గాని, చనిపోతే చెల్లించడం కానీ జరగటం లేదన్నారు. ఇంతకుమించి నా విషయం ఏమిటంటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన పోర్టల్ కూడా గత ఆరునెలల కాలంగా మూసివేయటం సోచినీయమని, దీనివల్ల కనీసం లోన్లుగానే కొత్త బాండ్లు గాని రిటైర్మెంట్ విషయంలో గానీ అప్లికేషన్ పెట్టుకోడానికి కూడా సదుపాయం లేదనే తెలిపారు.రిటైరైన ఉద్యోగికి జిపిఎఫ్ సొమ్ము కూడా చెల్లించక పోవడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు తమ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అధిగమించలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిల విషయం ఒక అంశం అయితే, ప్రతినెల నిర్ణీత సమయానికి జీతాలు, పెన్షన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రం ప్రతి 6 నెలలకు కొత్త డీఎ ప్రకటిస్తుంటే, రాష్ట్రప్రభుత్వం కనీసం పాత డిఏలను కూడా ఉద్యోగులకు చెల్లించలేక పోతోందన్నారు. . సి పి ఎస్ కు ఉద్యోగుల నుంచి 10% మినహాయిస్తున్న ప్రభుత్వం, మరియొక 10 శాతం తమ వాటా కింద చెల్లించాలని, ఈ రెండిటినీ ప్రాన్ ఎకౌంట్కి జత చేయాల్సింది ఉండగా, కనీసం సిపిఎస్ ఉద్యోగులు కడుతున్న 10% అమౌంట్ను కూడా సంవత్సర కాలముగా మాత్రం జమ చేయడం లేదన్నారు. సిపిఎస్ రద్దు చేసి, OPS పునరుద్ధరిస్తారని మాట ఇచ్చిన ప్రభుత్వం దానికి కట్టుబడక పోవటం శోచనీయమని చెప్పారు.
12వ పిఆర్సికి కమిషనర్ను అపాయింట్ చేసినప్పటికీ గత ఎనిమిది నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటీరియర్ రిలీఫ్ ను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 11వ తేదీన విస్తృత స్థాయి జేఏసీ సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి నోటీసు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిచి డిమాండ్స్ ని పరిష్కారం చేయాలని, లేకుంటే ఆందోళన బాట పట్టేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నానని చెప్పడం పైన పటారం లోన లొటారం చందంగా ఉందన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అదే మాటకు కట్టుబడాలన్నారు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గిస్తోందని, కొత్తగా అధ్యాపక నియామకాలు చేపట్టడం లేదన్నారు. కేవలం ప్రచారమే తప్ప పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. గతంలో ఉపాధ్యాయులు బి ఆర్ టి ఎస్ రోడ్లో చేసిన ఆందోళన తర్వాత ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందన్నారు. ఇటువంటి దుస్థితి ఉపాధ్యాయ రంగ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి తరఫున ప్రభుత్వానికి మరొకసారి తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాలి నాయుడు మాట్లాడుతూ తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వంపై నమ్మకంతో దాచుకున్న తమ డబ్బును సైతం నిర్ణీత సమయానికి విశ్రాంత ఉద్యోగుల ఖాతాలో జమ చేయకపోవడం విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణిని ప్రతిబింబిస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎడిషనల్ క్వాంటం ఆఫ్ అమౌంట్ కూడా ఈ ప్రభుత్వం తగ్గించిందని దానిని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ కార్యదర్శి ఎండి ఇక్బాల్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎ. సాంబశివరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి సాయిరాం, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సహాధ్యక్షులు డి ఎస్ ఎన్ రెడ్డి, జిల్లా ఎన్జీవో సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం రాజాబాబు, కె. సంపత్ కుమార్, ఎస్.కె. నజీరుద్దీన్, బివి రమణ, కె. శివలీల, జయశ్రీ, సత్యనారాయణ రెడ్డి, సిహెచ్ మధుసూదన రావు, ఎస్.కె. ఖాసిం, సిహెచ్ రాధాకృష్ణ తదితరులతో సహా పలువురు జిల్లా సంఘ నేతలు పాల్గొన్నారు.