– మార్గదర్శకాలకు అనుగుణంగా సన్నద్ధత కార్యకలాపాలు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి హాజరయ్యారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై సీఈవో మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ డిల్లీరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తుది ఓటర్ల జాబితా అనంతరం వివిధ ఫారాల పరిష్కారం, పోలింగ్ స్టేషన్లలో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, భద్రతా సిబ్బందికి శిక్షణ, నియోజకవర్గాల వారీగా రూట్లు, అవసరమైన వాహనాలు తదితర అంశాలపై ఏర్పాట్లను తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కమ్యూనికేషన్ ప్రణాళిక, సాంకేతిక వినియోగ ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడించారు.