గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగర ప్రజలు త్రాగునీటి సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిఎంసి శుద్దమైన త్రాగునీటిని అందించడంలో నిర్దేశిత నిబందనల మేరకు అన్ని చర్యలు పక్కాగా తీసుకుంటుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఉదయం శారదా కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే నగర మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీటి కాలుష్యం విషయం తెలియగానే శారదకాలని సదరు ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు వచ్చిన కుటుంబాలను పరామర్శించి, వారితో అనారోగ్యకారణాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. శారదకాలని వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో, ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న 19 మంది బాదితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూపరిండెంట్ ను ఆదేశించడం జరిగిందన్నారు. ఇప్పటికే 3 రోజుల క్రితం సంగడిగుంట తిరుమలచారి కాలనిలో జరిగిన సంఘటన పై తక్షణం స్పందించి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాల్లో డోర్ టు డోర్ త్రాగునీటి నమూనా పరీక్షలు, క్లోరిన్ పరీక్షలు ప్రభుత్వ మెడికల్ కాలేజిలోని రీజినల్ ల్యాబ్ వారి చే పరీక్షించడమైనది. త్రాగునీటిలో క్లోరిన్ కూడా తగు పాలల్లో ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రజారోగ్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటి ఆరోగ్య సర్వే చేయడం జరిగిందని, అందులో ఎవ్వరికీ డయేరియా ప్రభావం లేదని రిపోర్ట్ వచ్చింది.
శనివారం మృతి చెందిన శారదాకాలనికి చెందిన పద్మ (18ఏళ్లు) ప్రాధమిక విచారణలో డయేరియా వలన మృతి చెందలేదని తెలిసిందని, పోస్ట్ మార్టం కూడా చేపట్టాలని ఆదేశించామన్నారు. శారదాకాలని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందని, ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ క్యాంప్ లో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. బాదితులకు మెరుగైన వైద్యం అందేలా జిజిహెచ్ లో నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ ఆషా, శారదా కాలనిలో క్షేత్ర స్థాయిలో మెడికల్ సర్వే, వైద్య పరీక్షలు పర్యవేక్షణ చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు నగరంలోని ప్రతి రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి సరఫరా జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శుల ద్వారా ఫస్ట్ పాయింట్ నుండి టేయిలేండ్ వరకు క్లోరిన్ శ్యాంపిల్స్ సేకరించాలని ఆదేశించామని తెలిపారు. శారదా కాలనీ రిజర్వాయర్ షెడ్యుల్ మేరకు జనవరి 20 న క్లీన్ చేయడం జరిగిందని, నగరంలోని అన్ని రిజర్వాయర్లు కూడా నిర్దేశిత గడువు మేరకు క్లీన్ చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Prajavartha Online Telugu News