– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు అందించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి.. హక్కు పత్రాలు అందించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్‌తో కలిసి చందర్లపాడు-2 సచివాలయాన్ని సందర్శించారు. గ్రామ సచివాలయం ద్వారా జరుగుతున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. సచివాలయం పరిధిలోని లబ్ధిదారులందరికీ త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ లబ్ధిదారులకు వివిధ లేఅవుట్లలో కేటాయించిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. లక్ష్యాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట నందిగామ ఆర్డీవో పి.సాయిబాబు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.