-డా. యస్ జీ టి సత్య గోవింద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో “బర్డ్ ఫ్లూ ” అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి. జి. సత్య గోవింద్ మంగళ వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదు. గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు ఆమేరకు విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే నిర్వహించి ఈ వ్యాధి ఆనవాళ్ళు ఎక్కడా లేవని తెలియజేయుచున్నట్లు ఆయన నిర్ధారించారు. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వలన మనుష్యులకు వ్యాప్తి చెంది చనిపోయిన దాఖలాలు లేవన్నారు. కోడి గ్రుడ్లు మరియు కోడి మాంసము సంప్రదాయ బద్దంగా ఉడికించి తినుటవలన ఏ విధమైన ఇతర వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం లేదన్నారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది యావన్మంది తో జిల్లాలో (38) రాపిడ్ రెస్పాన్స్ టీములు ఏర్పాటు చేసి ఈ వ్యాధి గురించిన నివారణా చర్యలకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఈ వ్యాధి సోకినట్లు ఈ దిగువ లక్షణాల ద్వారా అనుమానించ వచ్చును.
1. గ్రుడ్లు పెట్టే కోళ్ళ ఫారాలలో ఆకస్మాత్తుగా 10% గ్రుడ్ల ఉత్పత్తి తగ్గుట.
2. ఒకేసారి పదుల సంఖ్య్యలో కోళ్ళు చనిపోవుట.
3. ఇతర వలస పక్షులు, కొంగలు మొదలగు పక్షులు గుంపులు గుంపులుగా చనిపోవుట.
ఈ జిల్లాలో సుమారు ఒక కోటి నలభై లక్షలు వరకు గ్రుడ్లు పెట్టే కోళ్ళు కలవు. సుమారు 750 మంది రైతులు గ్రుడ్లు పెట్టే కోళ్ళను పెంచుచున్నారు. సుమారు 10 లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ళ పెంపకం జరుగుచున్నది. రైతులు వారి, వారి ఇళ్ళ వద్ద పెంచుకునే పెరటి కోళ్ళు, నాటు కోళ్ళు సుమారు 7 లక్షల వరకు కలవు. రైతులు ఎవరైనా ఒకేసారి కోళ్లలో అధిక మరణాలు సంభవించినా లేదా గ్రుడ్లు పెట్టే కోళ్లలో ఒకేరోజు 10% గ్రుడ్లు ఉత్పత్తి తగ్గిననూ, చనిపోయిన కోళ్ళను బహిరంగ ప్రదేశములలో, కాలువలలో మరియు చెరువులలోను పారవేయరాదు, ఆ విధంగా ఎక్కడైనా చూసిననూ, తెలిసిననూ ఈ విషయము వెంటనే మీ దగ్గరలో గల పశువైద్యాధికారి వారి దృష్టికి తీసుకురావలసినదిగా సత్య గోవింద్ కొరియున్నారు. కోరడ మైనది.