-ధ్వజస్తంభం ఉంటేనే ఏ దేవాలయానికైనా ఆలయతత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాలయాలలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో.. ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని శ్రీ సుదర్శన వెంకటేశ్వరస్వామి దేవస్థానం నందు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం వేద పండితుల మంత్రోత్చరణల మధ్య శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏ దేవాలయానికైనా ధ్వజస్తంభం ఉంటేనే ఆలయతత్వం వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారన్నారు. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరియడంతో పాటు.. ఐక్యత పెరుగుతుందన్నారు. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. శ్రీ సుదర్శన వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎలప్పుడూ ఉంటాయని వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తిచేసిన ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు వేదాంతం ప్రవీణ్ ఆచార్యులు, నాయకులు కాళ్ల ఆదినారాయణ, చెన్నకేశవరెడ్డి, ప్రేమ్, నాగేంద్రం, చిన్నారెడ్డి, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.