– స్త్రీ, శిశు సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలపాలి
– 33 మందికి నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందని.. వీటిలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కొత్తగా నియామక పత్రాలు అందుకున్నవారు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేసేందుకు జిల్లా ఎంపిక కమిటీ కంప్యూటర్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరికి కలెక్టర్ డిల్లీరావు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. పోషణ్ అభియాన్‌లో జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్, కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి ఎనిమిది మందికి, జిల్లా పరిరక్షణ విభాగంలో బాలల పరిరక్షణ అధికారి, ప్రొటెక్షన్ అధికారి, లీగల్ కం ప్రోబేషన్ అధికారి, అకౌంటెంట్, అవుట్‌రీచ్ వర్కర్‌కు సంబంధించి ఆరుగురికి, ప్రత్యేక దత్తత విభాగంలో మేనేజర్, కోఆర్డినేటర్ తదితర పోస్టులకు సంబంధించి తొమ్మిది మందికి, బాలసదన్‌లో పనిచేసేందుకు పది మందికి నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 33 మందికి నియామక పత్రాలు అందజేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయడం స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చేలా చేయొచ్చన్నారు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ పనితీరులో మెరుగైన ప్రదర్శన కనబరచాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత అధికారిణి జి.ఉమాదేవి, సీడీపీవోలు జి.మంగమ్మ, కె.నాగమణి తదితరులు పాల్గొన్నారు.