– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్.కె. మహాన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకు పథకాలు, సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్.కె.మహాన అన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తున్న సామాజిక భద్రత పథకాలు, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, గ్రామీణ ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండేలా, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లకు సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ మువ్వల శ్రీధర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ద్వారా కుటుంబ ఆదాయాలు పెరుగుతాయని, గ్రామీణ పేదలు, ప్రజలు ప్రభుత్వ పథకాలు బ్యాంకుల ద్వారా లబ్ధి పొందే విధంగా ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దటంలో ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె.ప్రియాంక మాట్లాడుతూ ప్రజలకు, బ్యాంకులకు మధ్య వారధిగా ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలు పని చేస్తాయని ఎన్టీఆర్ జిల్లాలో 15 మండలాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సహకారంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు మాట్లాడుతూ జన సురక్ష పథకాలను ప్రజలకు అందించడం కోసం పూర్తిస్థాయిలో శ్రమించాలని, ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రతలను అందించడంలో బ్యాంకులు ఎనలేని కృషిచేస్తున్నాయని, బ్యాంకు ద్వారా ప్రజలకు అందే సామాజిక సేవా పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కౌన్సిలర్లను ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ప్రతినిధి గౌతమ్, సంస్థ ప్రాజెక్టు మేనేజర్ వి.అశోక్ కుమార్, రాష్ట్ర సమన్వయకర్త వై. బాబురావు, జిల్లా సమన్వయకర్త కె.శ్రీనివాసరావు, విజయవాడ రూరల్ ఆర్థిక అక్షరాస్యతా కేంద్రం కౌన్సిలర్లు చింతిరాల చక్రవర్తి, సగ్గుర్తి వినోద్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.