-రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాల విశిష్టత అసామాన్యమైనదని, ఇక్కడి నేత వస్త్రాలకుండే అసాధారణమైన గొప్పదనాన్ని మరెక్కడా చూడలేమని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు. అంతర్జాతీయ వస్రప్రదర్శన భారత్ టెక్స్ 2024లో ఏపీ పెవిలియన్‌ను మంత్రి బుగ్గన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్కొ , లేపాక్షి స్టాల్స్‌ను సందర్శించి బి2బి వ్యాపార సరళిని తెలుసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత ఉత్పత్తుల నాణ్యత, విశిష్టతల గురించి స్టాళ్ల నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేనేత కార్మికులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా క్రుషి చేస్తోందని, చేనేత వ్రుత్తిలో ఉన్న 71,783 కుటుంబాలకు నెలకు 24 వేల రూపాయల వంతున ఐదేళ్లలో 969.77 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం అందజేసిందని గుర్తు చేశారు. మగ్గం నేయడం కష్టంతో కూడుకున్న పని కావున.. పెన్షన్ కానుక కింద నేత కార్మికుల వయో పరిమితిని 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించి, నెలకు 3000 రూపాయల వంతున లక్ష మంది నేత కార్మికులకు 1432.82 కోట్ల రూపాయల సాయం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, కమిషనర్ ఎం.ఎం.నాయక్ తదితరులు పాల్గొన్నారు.