-ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికలలో గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఓటు నమోదు అయిన పోలింగ్ కేంద్రాల పరిథిలో ప్రత్యేక క్యాంపు లని నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాజానగరం మండలం తూర్పు గోనెగూడెం ఎమ్.పి.పి. ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఆవరణలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 186, 187 లని ఎస్పి పి. జగదీష్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, త్వరలో ఎన్నికల కమీషన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిథిలో ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకి వచ్చెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన లో కలెక్టర్ వెంట ఎస్పి పి. జగదీశ్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, తహశీల్దార్ అబ్దుల్ రెహమాన్, బి ఎల్ వో లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.