-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 14 లక్షలతో త్రాగునీటి పైపు లైన్ పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ.. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మేటిగా నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 64 వ డివిజన్ ఎన్టీవోస్ ఏ కాలనీ నందు రూ. 14 లక్షల వ్యయంతో త్రాగునీటి పైపులైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి మంగళవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. గత తెలుగుదేశం పాలకులు ప్రజలను మోసగించడానికి శిలాఫలకాలు వేయడం తప్ప పనులలో చిత్తశుద్ధి చూపలేదని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపడం జరుగుతోందన్నారు. ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులలో ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో అనితర సాధ్యమైనటువంటి అభివృద్ధిని సాధించగా.. 64వ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు అక్షరాల రూ. 22 కోట్ల నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ దృష్టికి వచ్చిన ప్రతి చిన్న సమస్యను.. నిర్ణీత గడువును నిర్దేశించుకొని మరీ పూర్తిచేసుకున్నట్లు వివరించారు. ఈ అభివృద్ధి రానున్న రోజుల్లోనూ ఇదేవిధంగా కొనసాగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి భారీ మెజార్టీతో గెలుపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, పందిరి వాసు, అక్తిశెట్టి నారాయణ, మాతా మహేష్, మేడా రమేష్, వెంకటేశ్వరమ్మ, సామ్రాజ్యం, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.