గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అమలులో భాగంగా తొలగించిన రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు సరైన అనుమతులు లేకుండా తిరిగి ఏర్పాటు చేస్తే ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంలోని నగరంపాలెం, కన్నావారితోట, రైల్ పేట, నాజ్ సెంటర్, కొత్తపేట, వసంతరాయపురం, శారదాకాలని, సంజీవయ్య నగర్, నెహ్రు నగర్ ల్లోని పలు ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కోడ్ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలను, బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు అన్నింటినీ తొలగించడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన వాటిని సరైన అనుమతి తీసుకోకుండా కొందరు తిరిగి ఏర్పాటు చేస్తున్నారని క్షేత్ర స్థాయి ఎంసిసి అధికారులు రిపోర్ట్ ఇస్తున్నారని, అటువంటి వారి పై వెంటనే పోలీసు కేసులు నమోదు చేయాలని ఏఆర్ఓలను ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా ఎంసిసి ఉల్లంఘనలను ప్రజలు గుర్తిస్తే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్లైంట్ సెల్ కు కాల్ చేసి తెలియచేయడం లేదా వివరాలను 98499 08391 కు వాట్స్ అప్ ద్వారా పంపితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యటనలో ఏఆర్ఓ సునీల్, భీమరాజు, ఎంసిసి టీం అధికారి అనుపమ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News