– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై మీ పెత్తనం కుదరదు
– వృద్ధులను సైతం ఇబ్బంది పెడుతూ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు
– డబ్బులతో ప్రజల మనసులను గెలవలేరు
– టీడీపీ నేతలపై వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ఫైర్
– పేదల గడప వద్దకే సంక్షేమం తెచ్చిన జగనన్న వెంటే జనమంతా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమపై పెత్తందారుల పెత్తనాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంగీకరించబోరని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా అన్ని మతాలు, కులాల ప్రజలు కలిసిమెలిసి అన్నాదమ్ములుగా జీవిస్తున్నారని, పెత్తందారులకు చోటు లేదని స్పష్టంచేశారు. ఒకవేళ డబ్బు మూటలతో వచ్చి నమ్మకంగా నటించి ఓట్లు పొంది, తర్వాత పెత్తనం చేయవచ్చని చూసినా కుదరదని, ఇక్కడ ప్రజలు చైతన్యవంతులని చెప్పారు. స్థానిక 47వ డివిజన్‌లో గురువారం ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన తాగునీరు వంటి కొన్ని సమస్యలపై అధికారులతో అక్కడి నుంచే మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి పేదవాడి గడప వద్దకు నడిపంచారని, ఏ సమస్య ఉన్నా తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే తాము గడపగడపకు వెళ్లి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కనీసం ఇక్కడ వీధులు, ప్రజలు, సమస్యలు ఏమీ తెలియని సుజనా చౌదరికి బీజేపీ సీటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గానికి ఇవాళ ఒక పెత్తందారు డబ్బు మూటలతో వచ్చి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ వంటి మతోన్మాద పార్టీకి, దానికి వంతపాడుతున్న టీడీపీ, జనసేనలకు ఇక్కడ స్థానం లేదన్నారు. తమ స్వార్థం కోసం చివరికి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సైతం ఇబ్బంది పెడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలనను, సంక్షేమ పథకాలను తమ ఇంటి ముంగిటకే తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్ వెంటే ప్రజలంతా ఉన్నారని, తమ లక్ష్యం 175కు 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమేనని ఆసిఫ్ స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగ,గోదావరి బాబు, యలకల చలపతిరావు, వడ్రా కార్పోరేషన్ డైరెక్టర్ దేరంగుల రమణ, అత్తులూరి పెద్దబాబు, ఎస్సి నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు కే. నాగ మల్లేశ్వరరావు, కమల జోజి, విజయ లక్ష్మి, దుర్గ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.