– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తొలి విడత ర్యాండమైజేషన్ ద్వారా పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ సజావుగా, దోష రహితంగా జరిగినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ ఆధారంగా గొల్లపూడి ఈవీఎం గోదాము వద్ద పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. శనివారం కూడా ఇది కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా రిటర్నింగ్ అధికారులు.. సహాయ సిబ్బందితో సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ర్యాండమైజేషన్‌లో నియోజకవర్గాలకు అనుసంధానమైన ఈవీఎంలను వేరుచేసి, ప్రత్యేక నంబరింగ్ ఇవ్వడం, స్కానింగ్ చేయడం, బాక్సింగ్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు ట్రాన్స్‌పోర్టింగ్.. ఇలా ప్రతిదశలోనూ అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలిపారు. మొత్తం 1,781 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 20 శాతం రిజర్వ్‌తో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లు అందించడం జరుగుతోందని.. అదే విధంగా 30 శాతం రిజర్వ్‌తో వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. హమాలీలు మంచి సేవలు అందించారని.. వేసవి నేపథ్యంలో వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో భాగస్వాములైన ఆర్‌వోలు, సహాయ సిబ్బంది ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్, కేఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఆర్‌వో కిరణ్మయి, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, ఈవీఎం నోడల్ అధికారి జి.మహేశ్వరరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.