-టీటీడీ నిత్యాన్నదాన పథకానికి కూరగాయల అందజేత
-డిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ దాతృత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్న ప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడం ద్వారా లభిస్తుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు అన్నారు.
టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి కూరగాయల అందజేత కార్యక్రమంలో ఆయన శనివారం పాఠశాల డైరెక్టర్ సునంద తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
లక్షలాదిమంది భక్తులు కలియుగ దైవాన్ని దర్శించుకునేందు ప్రతీరోజు తిరుమలకు తరలి వస్తారన్నారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే భక్తుల కోసం పంపినట్టుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారన్నారు. విద్యారంగంలో ఎంతో మంది బలహీన వర్గాల చిన్నారులకు తమ శక్తి మేరకు సేవలందిస్తున్నామన్నారు. విద్యారంగంలో పాటు ధార్మిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఆ దేవదేవుడు ఇచ్చిన అనుగ్రహమే కారణమన్నారు. కలియుగ దైవం దీవెనలతో విద్యారంగం అబివృద్ధి చెందాలని కోరుతున్నామన్నారు.
కార్యక్రమం నిర్వాహకులు మరడ నాగేంద్ర (నాగు) మాట్లాడుతూ దివంగత ధార్మికవేత్త మండవ కుటుంబరావు 2004లో ప్రారంభించిన ఈ మహోజ్వల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మరణానంతరం ఎంతోమంది సేవాతత్పరుల దాతృత్వంతో నిర్విఘ్నంగా ప్రతి మాసం 20 టన్నుల కూరగాయలు ఉచితం గా తిరుమలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు భగవదనుగ్రహం పొందడం కోసం చేసే సేవలలో ఆహారం పంపిణీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఇటువంటి సేవలు అందించేందుకు ఆర్థిక శక్తి తో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈకార్యక్రమంలోభాగస్వాములు అయ్యేందుకు ఎంతోమంది దాతలు తనతో కలిసి రావడం భగవదనుగ్రహమేనన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని, అటువంటి సేవలో తమలాంటి స్వామి వారి భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బృహత్కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పరిమి పవన్ చంద్, డైరెక్టర్లు వల్లూరు పూర్ణచంద్, వినూత్న, కడియాల ప్రవీణ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపాల్ ఎమ్మెస్ భువనేశ్వర్ తదితరులతో సహా పలువురు ధార్మిక, విద్యా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News