Breaking News

డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ భావజాలం, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరీ కె హర్షవర్ధన్ అన్నారు.

స్థానిక లెనిన్ సెంటర్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ డా. బాబు జగజీవన్ రామ్ భవన్లో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, డైరెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎండి ఎస్. చిన రాములు, లిడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ డోలాశంకర్ లు డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా. బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదువుకొని ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోవాలన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే ఆశయాన్ని నిర్దేశించుకుని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారతీయ సమాజాన్ని పునర్ నిర్మించడానికి కృషి చేశారన్నారు. జాతీయ సమైక్యతకు అంబేద్కర్ సింబల్ గా నిలుస్తారన్నారు. విద్యారంగంలో అనేక అవకాశాలు సదుపాయాలు ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయరాదన్నారు. చదువుకి అన్నిచోట్ల ప్రోత్సాహం ఉంటుందని ప్రతి గ్రామంలోనూ కుటుంబంలోనూ చదువును ప్రోత్సహిస్తారన్నారు. ముఖ్యంగా బాలికలు ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్ అవుట్ కాకుండా డిగ్రీ వరకు చదువు కొనసాగించాలన్నారు.
జాతీయ సమైక్యతకు డా. బి.ఆర్ అంబేద్కర్ గుర్తుగా నిలుస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఆ మహనీయుని ద్వారా జాతీయ సమైక్యతకు గుర్తింపు వచ్చిందని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ అన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ చరిత్ర అందరికీ సుపరిచితమే అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పుతో ఉన్నత శిఖరాలు చేరుకున్నారన్నారు. ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉండాలని ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే తత్వం ధైర్యం ద్వారా సాధ్యపడుతుందన్నారు. ఇంకా చదువుకోలానే ఆసక్తి ఉన్నప్పటికీ తనకు చిన్నతనంలోనే ఆర్థిక కారణాలతో వివాహం చేద్దామనుకున్న తల్లిదండ్రులను ఎదిరించి ఇంటర్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన కర్నూలు కు చెందిన నిర్మల ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ గొప్ప పుట్టుదల కలిగిన వ్యక్తి, మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని1891 ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానంగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసే రాంజీ మలోజి సాక్వాల్, భీమా భాయ్ దంపతులకు చివరి సంతానంగా జన్మించారన్నారు.
1927లో మహాద్ లో దళిత జాతుల మహాసభ జరిగినప్పుడు మహారాష్ట్ర గుజరాత్ నుండి కొన్ని వేల మంది వచ్చారని, అక్కడి చెరువులో నీటిని తాగేందుకు వీలు లేకపోయినా అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారని ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించిందని అన్నారు. స్వాతంత్రం అనంతరం దేశాన్ని సరైన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారని కలెక్ట్ ఢిల్లీ రావు అన్నారు.

జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ డా.బి.ఆర్. అంబేద్కర్ బాటలో నడవడం ద్వారా ఆయనకు నిజమైన నివాళిని అర్పించిన వారవుతామన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నేటితరమైన మనపైన ఉందన్నారు. ఆయన భావజాలంలో చదువు, సమీకరించు, పోరాడు ప్రధాన అంశాలు అయి ఉన్నాయని అయితే దురదృష్టవశాత్తు ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోలేని యువత కేవలం తిరుగుబాటును మాత్రమే లక్ష్యంగా చేసుకొని సమాజంలో అనివార్య అత్యవసర పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని భావించి పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ, హితకారిణి సమాజం, డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా చదువుకునే అవకాశం కల్పించారన్నారు. చదువు ఒక ఫ్లాట్ ఫామ్ లాంటిదని సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకొని ప్రతి ఇంటి నుండి ఒక ఉన్నత స్థాయి పొందిన వ్యక్తి ఉండాలని జాయింట్ కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో తొలుత భవన ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ , సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కృష్ణమోహన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని విజయభారతి, సంఘ నాయకులు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *