– అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలి
– నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైండింగ్ అధికారులు (పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో) పాత్ర కీలకమని.. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. ఆదివారం విజయవాడ పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమం జరిగింది. అదే విధంగా లయోలా కళాశాలలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు (ఏఎల్ఎంటీ) ద్వారా జరుగుతున్న రెండో రోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ డిల్లీరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై ట్రైనర్లు శిక్షణ ఇవ్వగా.. ఆయా అంశాలపై పీవోలు, ఏపీవోల అవగాహన స్థాయిని కలెక్టర్ డిల్లీరావు పరీక్షించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశముంది? వాటిని అప్పటికప్పుడు ఎలా అధిగమించాలనే దానిపై మార్గనిర్దేశం చేశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను క్షుణ్నంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ నిర్వర్తించాల్సిన విధుల గురించి క్రమశిక్షణతో తెలుసుకొని.. ఆత్మవిశ్వాసంతో పోలింగ్ ప్రక్రియకు సిద్ధమవాలన్నారు. చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్ అప్రోచ్‌తో పెంపొందించుకోవాలన్నారు. మాక్ పోల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ స్టేషన్ సెటప్, ఈవీఎం-వీవీప్యాట్, మార్క్డ్ కాపీ, టెండర్డ్ ఓట్, ఛాలెంజ్డ్ ఓట్, పీవో డెయిరీ, పీవో రిపోర్ట్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పీవో, ఏపీవోలు నిర్వహించాల్సిన వివిధ ఫారాలు, రిజిస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఎన్నికల విధులను విజయవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన అవగాహన పెంపొందించుకునేందుకు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు సూచించారు. కార్యక్రమంలో విజయవాడ మునిసిపల్ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఆర్వో స్వప్నిల్ దినకర్ పుండ్కర్, విజయవాడ ఆర్డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆర్వో బీహెచ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News