విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ లో తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు శుక్రవారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని మల్లాది విష్ణు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని రోజులుగా విషం కక్కుతూ.. ప్రజల్లో అపోహలు కల్పించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా, వాయిస్ మెసేజ్ ల రూపంలో, బహిరంగ సభల్లో కించపరిచేలా మాట్లాడుతూ.. పదేపదే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి శవరాజకీయాలు చేస్తున్నారంటూ ట్విట్టర్ లో టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా ఈసీని కోరినట్లు తెలిపారు. వ్యక్తిత్వ హననం సరికాదని ఈసీ స్పష్టంగా చెప్పినప్పటికీ.. చంద్రబాబు, టీడీపీ నేతల బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. ఎదురువారిపై బురదచల్లి రాజకీయ లబ్ధిపొందాలనే నీచమైన స్వభావం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
హింసా రాజకీయాలకు టీడీపీ తెరదీసింది
రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తెలుగుదేశం తెరదీసిందని మల్లాది విష్ణు అన్నారు. ఓటమి భయంతో అమాయకులపై దాడులకు తెగబడుతున్నారని.. మంగళగిరిలో లోకేష్ బ్యాచ్ దాష్టీకానికి ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ ట్విట్టర్ పోస్టులు, బహిరంగ సభలో రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. శవ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని.. వంగవీటి మోహన రంగా హత్య నుంచి మంగళగిరి ఘటన వరకు టీడీపీ శవ రాజకీయాలనే నమ్ముకుందని విమర్శించారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థపై కోపంతో అవ్వాతాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి.. 30 మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని ఆరోపించారు. అధికారులను, సమాజంలోని అన్నివర్గాలను భయపెట్టి అధికారంలోకి రావాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది తప్ప కూటమికి ఒక స్పష్టమైన అజెండా అంటూ లేదని విమర్శించారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే.. ఘటనను మసిపూసి మారేడుకాయ చేయడానికి తెలుగుదేశం బ్యాచ్ ఎంతగానో ప్రయత్నించిందన్నారు. సింపతీ డ్రామాలని, కోడికత్తి-2 అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. కానీ దాడి వెనుక తెలుగుదేశం హస్తం ఉందని బయటకు వచ్చాక నోరుమెదపడం లేదన్నారు.
మహిళలంటే సీఎం జగన్ కు అపార గౌరవం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. మహిళలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపార గౌరవమని.. నవరత్నాల్లో 7 పథకాలను ఆడపడుచుల పేరిట అందించి, మహిళా లోకం గర్వపడేలా చేశారన్నారు. అక్కచెల్లెమ్మల అభ్యున్నతే ధ్యేయంగా.. లక్షల కోట్ల సంక్షేమాన్ని అందించారన్నారు. హోం మంత్రి సహా కేబినెట్లో మహిళలకు కీలక శాఖలను అప్పగించారన్నారు. కనుక ముఖ్యమంత్రిపై జనసేన నాయకుల విమర్శలు అర్థరహితమని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని.. అది చూసి కూటమికి ఓటమి భయం పట్టుకుందన్నారు. అలాగే తెలుగుదేశం చేస్తున్న విషప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రావెల కిషోర్ బాబు, అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.