– క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయంతో పనిచేయాలి
– నివేదికల నిర్వహణ వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి
– జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈసీఐ మార్గదర్శకాలకు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వివక్ష రహితంగా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ జరిగేలా అధికారులు కృషిచేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ (ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్; విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ; విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మదన్ కుమార్ హాజరయ్యారు. 16 విభాగాల నోడల్ అధికారులు కూడా హాజరైన ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేసి వ్యయ పర్యవేక్షణను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సహాయ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ బృందాలు ఎలాంటి వివక్షకు తావులేని వాతావరణంలో పనిచేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో మంచి బృందం జిల్లాలో పనిచేస్తోందని.. ఇందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రలోభాలకు తావులేకుండా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు బృంద స్ఫూర్తితో, నిబద్దతతో పనిచేయాలని వి.జస్టిన్ సూచించారు. అంతకు ముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలను పీపీటీ ద్వారా వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 16,99,350 మంది ఓటర్లు ఉన్నారని.. అంతర్రాష్ట్ర, జిల్లా చెక్‌పోస్టులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్)ను పటిష్టంగా అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 3.21 కోట్ల నగదుతో సహా మొత్తం రూ. 6.45 కోట్ల మేర సీజర్లు జరిగినట్లు వివరించారు. అదే విధంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్, ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ, పోలీస్, సెబ్, ఐటీ తదితర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల కార్యకలాపాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కార్యకలాపాలను కలెక్టర్ డిల్లీరావు తెలియజేశారు.
కమాండ్ కంట్రోల్ కేంద్రం సందర్శన: జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్.. కలెక్టర్ డిల్లీరావుతో కలిసి కలెక్టరేట్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూమ్‌లోని సీ-విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఈఎస్ఎంఎస్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా సెల్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి.. మార్గనిర్దేశనం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీసీపీలు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు తదితరులతో పాటు విజయవాడ ఆర్‌డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్, కేఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఆర్‌వో ఇ.కిరణ్మయి, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్‌వో జి.వెంకటేశ్వర్లు, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారి ఎస్.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.