విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్; విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ; విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మదన్ కుమార్ తదితరులతో కలిసి ఓటర్లను జాగృతం చేసే పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టతను తమ బాధ్యతగా భావించి మే 13న తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, డీసీపీలు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News