ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యయుతమైన భారత్ లో ఓటు హక్కు అనేది ఒక చక్కని అవకాశమని, దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్. రజిని అభిప్రాయపడ్డారు. ‘ఓటు విద్య- ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం’ అనే అంశంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి), వర్శిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ఆచార్య కె.ఆర్. రజిని మాట్లాడుతూ ఓటు వేసే అవకాశం వచ్చినవారంతా ఎన్నికల వ్యవస్థలో బాధ్యతాయుతంగా పాల్గొనాలన్నారు. మేధావులు, విద్యావంతులు, విద్యాధికులు దేశంలో ఓటింగ్ శాతం పెరిగేందుకు ముందుకు రావాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఆంధ్ర ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత్ లోనే జరుగుతున్నదని …అందులో పాల్గొనే అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించారు. 18-29 వయసు మధ్యలో 30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వారంతా జాగురుతుగా వ్యవహరించి ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. యువత నిరాశ వీడి భారత్ భవిష్యత్ కోసం ఓటు వినియోగానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా ఫీల్డ్ పబ్లిషిటీ అధికారి బగాది తారక ప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెంచేందుకు భారత ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
వర్శిటీ రెక్టార్ ఆచార్య బి. అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి. సుజాత, జర్నలిజం విభాగం అధ్యాపకులు డా. ఆర్.తిరుపతిరావు, డా. జి.లీలావరప్రసాద్ లు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమానికి ముందు ‘ ఓటు హక్కు సద్వినియోగం’పై వర్శిటీలో ర్యాలీ నిర్వహించారు. ఓటు విద్య- ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కళాశాలల వారిగా బహూమతులు అందజేశారు. ఓటు దాని అవశ్యకతపై ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా, ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తూ, జిల్లాలోని పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన శ్రీ చక్రపాణి కళా బృందానికి చెందిన సభ్యులు ప్రదర్శించిన జానపద గేయాలు, నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి.