Breaking News

అవినీతిని అరికడతాం… కూటమి హామీలు అమలు చేస్తాం

-హామీలు అమలు చేయడం సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదం
-ప్రతి పథకంలో వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు
-స్కూలు పిల్లల చిక్కీల్లో కూడా రూ. 61 కోట్ల అవినీతి జరిగింది
-విద్యార్థుల ట్యాబ్ ల్లో రూ.212 కోట్లు దోచుకున్నారు
-మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ రూ. 41 వేల కోట్లు వెనకేసుకున్నారు
-ఇవన్నీ ఆపితే హామీల అమలు సాధ్యమే
-రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారికి అవమానం జరిగితే స్పందించని వ్యక్తి కన్నబాబు
-విశ్వాసం లేని ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపాలి
-కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ 

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి పార్టీలు ప్రకటించిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తే హామీలు అమలు సాధ్యమేనని అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రూ.41వేల కోట్లు దోచుకున్నారు… ఇసుకలో వేలకోట్లు మింగేశారు.. వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ.705 కోట్లు తగలేశారు.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లు… ఆ రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.. చిన్న పిల్లల చిక్కీల్లో కూడా రూ.61 కోట్లు దోచుకున్నారు.. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ ల్లో రూ.212 కోట్లు అవినీతి జరిగింది.. ఇలాంటివన్నీ అరికడితే హామీలు అమలు పెద్ద కష్టం కాదని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెంలో వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీ, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి  తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వీరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “2024 సార్వత్రిక ఎన్నికలు మన భవిష్యత్తుకు చాలా కీలకం. ఒకటికి పదిసార్లు ఆలోచించి యువత, మహిళలు, పెద్దలు ఓట్లు వేయాలి. దేశం బాగుండాలి… రాష్ట్రం బాగుండాలి అనుకునే వ్యక్తిని. అందరికీ సమ న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. శెట్టిబలిజలపై తొమ్మిది వేలకుపైగా అక్రమ కేసులు బనాయించారని తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కేసులను ఎత్తి వేస్తాం.

రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచనే తప్ప… స్వార్థం లేదు
నేను ఏనాడూ నా స్వార్థం కోసం ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని మాత్రమే ఆలోచిస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి ని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఆ సమయంలో నా స్థానంలో ఎవరున్నా… నేను ఎదగాలి, నా పార్టీ ఎదగాలి అని ఆలోచిస్తారు. కానీ నేను అలా ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలని అని ఆలోచించి రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను కలిసి మద్దతు ప్రకటించాను. రాష్ట్రం బాగుండాలి అంటే ఒక నాయకత్వం సరిపోదు. చాలా మంది నాయకుల అనుభవం కావాలి. అన్ని లోతుగా ఆలోచించి కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి భుజం కాశాము. ఒంటరిగా వెళ్తే 50 స్థానాలు పోటీ చేయోచ్చు… కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మమ్మల్ని మేము తగ్గించుకొని త్యాగాలు చేశాము. వైసీపీ లాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే మూడు పార్టీలు కలవాల్సిందే.

రూ.1000 కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు
కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతూ, నలుగుతున్నానంటే దానికి ఒకానొక కారణం కన్నబాబే. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మూల కారకుడు ఆయన. డొక్కు స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి ఈ రోజు వెయ్యి కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక నాయకుడు అంచెలంచెలుగా ఎదిగితే తప్పు లేదు. నమ్మినవారినే నలిపేసి ఎదగకూడదు. నియోజకవర్గం పరిధిలో రూ.20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిలో లే అవుట్ వేశారు. ఈ లేఅవుట్ లో 20 మంది స్థలాలు కొనుగోలు చేశారు. అయితే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే ప్రోద్భలంతో రౌడీలను పెట్టుకుని చుట్టూ గోడ కూడా కట్టించేశాడు. బాధితులు మొత్తుకున్నా, పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ఫలితం లేకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఎవరు లేఅవుట్ వేయాలన్నా ప్రత్యేక ప్యాకేజీలతో దండుకుంటున్నాడు. అనుమతి ఉన్న లేఅవుట్లకు రూ. 20 లక్షలు, అనుమతి లేకపోతే రూ.30 లక్షలు, పంటకాలువలను ఆక్రమించి లేఅవుట్ నిర్మిస్తే ఇంకో రేటు కట్టి దండుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి దగ్గర ఇలానే ఆస్తులు రాయించుకొని వేధించారు. చివరకు ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు. సూర్యారావు పేటలో మత్స్యకారులు గుడిసెలు బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో 750 ప్లాట్లు వేసి 30 మాత్రమే వారికి ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే మోసపోయిన మత్స్యకారులకు న్యాయం చేస్తాం. కొంగోడు గ్రామానికి బ్రిడ్జ్ చాలా అవసరం. బ్రిడ్జ్ కట్టడానికి వచ్చిన కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదని తరిమేశారు. ఇవన్ని చూస్తుంటే నాకు తెలిసినా కన్నబాబేనా ఈయన అనిపిస్తోంది. జగన్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో తిరిగితే ఇంత దారుణంగా తయారవుతారా..?

చిరంజీవి ని అవమానిస్తే ఏం చేస్తున్నాం?
ఈ రోజు కన్నబాబు అనుభవిస్తున్న పదవులు చిరంజీవి పెట్టిన భిక్ష. సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయం హీరోలకు సంబంధం లేదు. అయినా నిర్మాతల బాగు కోసం చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు వంటి పెద్ద హీరోలు జగన్ దగ్గరకు వెళ్లారు. వారంతా సీఎంను బతిమిలాడుతున్నట్లు వీడియో తీయించుకొని జగన్ ఆనందం పొందాడు. అజాతశత్రువు లాంటి చిరంజీవి ని, నీకు రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవిని ఆ నీచుడు అవమానిస్తే నీకు బాధ కలగలేదా కన్నబాబు..? ఆయనకు అండగా నిలబడాలని అనిపించలేదా..? విశ్వాసం లేని వ్యక్తిని ఇంటికి పంపే సమయం వచ్చింది.

వాళ్ల సంగతి తేల్చడానికే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను
రాష్ట్రం గంజాయికి కేరాఫ్ గా మారిపోయింది. ఏ మూలకు వెళ్లినా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. కస్టమ్స్ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడల్లా కాకినాడ తీర ప్రాంతంలో పడవలు తగలబడిపోతున్నాయి. యువత గంజాయికి బానిసై భవిష్యత్తు, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. యువత గంజాయి మత్తుకు బానిసలవ్వడంతో తల్లితండ్రులు కన్నీరు పెట్టుకుంటుంటే ద్వారంపూడి, కన్నబాబుకు జేబులు నిండుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయి స్మగ్లింగ్ ను ఉక్కుపాదంతో నలిపేస్తాం. ద్వారంపూడి, కన్నబాబులతో నరకం స్పెలింగ్ రాయిస్తాం. వాళ్ల సంగతి తేల్చడానికే నేను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. రౌడీయిజం, దాష్టీకాలకు బయపడి యువత ముందుకు రాకపోతే సమాజంలో మార్పు రాదు. మార్పు రాని సమాజం కుళ్లిపోతుంది. జగన్ ను గద్దెదించడానికి యువత అవిరామంగా కష్టపడాలి. 30వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రం నుంచి అదృశ్యమైపోతే మాట్లాడని ఈ ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. ఈ నేల కోసం కష్టపడే వ్యక్తుల సమూహాం మనకు అవసరం.

30వ తేదీన కూటమి మ్యానిఫెస్టో
దేశంలో గుజరాత్ తరువాత మన రాష్ట్రంలోనే ఎక్కువ తీర ప్రాంతం ఉంది. 30 శాతం మత్స్య సంపద మనమే ఎగుమతి చేస్తున్నాం. అయినా మత్స్యకారుల జీవితాల్లో మార్పు రావడం లేదు. కూటమి అధికారంలోకి రాగానే మత్స్యకారులను గుండెల్లో పెట్టి చూసుకుంటాం. తుపాన్లు తట్టుకునేలా ఇళ్లు, తుపాన్ షెల్టర్లు నిర్మిస్తాం. రూ.10 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తాం. రమణయ్యపేట, వలసపాకల, తమ్మవరం ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాల వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల యాజమానులతో మాట్లాడి వ్యర్థాలను శుద్ధి చేసిన తరవాతే సముద్రంలోకి వదిలేలా చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి రైతుల కళ్లల్లో ఆనందం నింపుతాం. జూనియర్ కాలేజ్, క్రీడాకారులకు అవుట్ డోర్ స్టేడియం అవసరం ఉంది. ప్రాధమిక ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తాం. ప్రతి ఇంటికి తాగడానికి మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా డీజిల్, గంజాయి మాఫియాలను తొక్కేస్తాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులు అందిస్తాం. మన ఆస్తులు, భూములు దోచుకోవడానికి వైసీపీ నాయకుడు చాలా ప్రమాదకరమైన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. దీని వల్ల వాళ్లు మన భూములు దోచుకోవడం సులభం అవుతుంది. మన భూములు వారి బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి.

కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన వ్యక్తి జగన్
వైసీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలనే కాకుండా అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేసింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 పథకాలను తొలగించింది. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తొలగించింది. ఒక ఎమ్మెల్సీ అయితే దళితుడు అయిన తన మాజీ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశాడు. అధికారం ఉంది కదా అని మర్డర్లు, దోపిడీలు చేస్తామంటే ఎలా..? కాకినాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరఫున చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదు. ఐదేళ్లకోసారి పార్టీ మారుతుంటాడు. ఒక పార్టీనే నమ్ముకోని ఉండనోడు… రేపు మీకేమి న్యాయం చేస్తాడు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని జగన్ ఖరాకండిగా చెప్పాడు. అప్పుడు కన్నబాబు జగన్ పక్కనే ఉన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలను వైసీపీ నాయకులు మోసం చేశారు. వీళ్లకు ఓట్లు అడిగే అర్హత కోల్పోయారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసనసభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా  పంతం నానాజీ పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాల’ని కోరారు.

Check Also

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి

-ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *