– ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు వినూత్న స్వీప్ కార్యక్రమాలు
– జిల్లాలో 85 శాతం, విజయవాడ అర్బన్‌లో 80 శాతం ఓటింగ్ లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా మొత్తంమీద 85 శాతం, విజయవాడ అర్బన్‌లో 80 శాతం ఓటింగ్ లక్ష్యంగా వినూత్న స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సోమవారం నగరంలోని డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం సమీపంలో సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చేతులమీదుగా రూపుదిద్దుకున్న ఓటర్లను జాగృతం చేసే సైకత శిల్పాన్ని కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ తదితరులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లా స్వీప్ నోడల్ అధికారి చొరవతో సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ అద్భుతమైన సైకతశిల్పం రూపొందించడం చాలా ఆనందాన్నిస్తోందని, ఓటర్లలో ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఓటు అమ్మకానికి కాదు.. నేను కచ్చితంగా ఓటు వేస్తాను.. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగొద్దు.. అనే గొప్ప సందేశాలను బాలాజీ తన సైకత శిల్పం ద్వారా అందించారన్నారు. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలోని నిర్లిప్తతను తొలగించి, ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా, కైకలూరు మండలం, పల్లెవాడకు చెందిన తాను విజయవాడలో స్థిరపడినట్లు తెలిపారు. సైకత శిల్ప రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లలో అవగాహన కల్పించడంలో తమ కళ ద్వారా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమం అనంతరం సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్‌ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. అధికారులతో కలిసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్వీప్ కార్యక్రమాల నోడల్ అధికారి యు.శ్రీనివాసరావు, ప్రజా గాయకుడు ఆర్.పిచ్చయ్య, కళాకారుడు అరవా రమేష్, గాంధీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.