Breaking News

మాతా, శిశు మరణాల పూర్తిస్థాయి నియంత్రణపై దృష్టిపెట్టండి…

-గత మరణాల సమగ్ర విశ్లేషణతో ప్రణాళికలు రూపొందించి, అమలుచేయండి…
-వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా కృషిచేయాలని, అదేవిధంగా గత మరణాలను సమగ్రంగా విశ్లేషించి పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికను అమలుచేయాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్‌ డిల్లీరావు జిల్లాలో చోటుచేసుకున్న మాతా, శిశుమరణాలపై వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ 23 నుండి ఏప్రిల్‌ 24 వరకు జిల్లాలో జరిగిన మాతృ శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మాతా, శిశు మరణాలకు కారణాలను విశ్లేషించి, ఇటువంటి మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసి, అమలుచేసుకోవాలన్నారు. ప్రతి మరణంపైనా సంస్థాగత, డీఎంహెచ్‌వో, జిల్లాస్థాయిలో సమగ్ర విశ్లేషణ, తద్వారా రూపొందించిన ప్రణాళికలతో మరణాలను శతశాతం నివారించేందుకు వీలవుతుందన్నారు. ప్రతి మరణాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలని, అదేవిధంగా పోషకాహార లోపాలు, జన్యు లోపాలు, సామాజిక కారణాలు, అవగాహన లోపాలు తదితర కారణాలను విశేషించుకోవడం ద్వారా మాతా శిశు మరణాలను ఘననీయంగా తగ్గించవచ్చునన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకునేలా గ్రామ స్థాయిలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తరచు గర్భిణీల ఇళ్లను సందర్శించి రక్తహీనత సమస్య ఏర్పడకుండా పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్‌ దగ్గరి నుంచి గర్భిణీల ఆరోగ్యం వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని, ముప్పు అధికంగా (హైరిస్క్‌) ఉన్నవారి పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మాతా, శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, విధానాల అమల్లో నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్‌ డిల్లీరావు వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సూచించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. యం సుహాసిని, డి.సి.హెచ్‌.ఏస్‌ డా.బి.సి.కె నాయక్‌, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. ఉమాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా. అమృత, డిప్యూటీ డియంహెచ్‌ఓ డా.ఇందుమతి, టి.బి వైద్యాధికారి డా.పద్మావతి, డిస్టిక్ట్‌ పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ డా. లిడియా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఏ.ఏన్‌.ఏమ్‌లు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Check Also

ప్రత్యేక హెూదా కోసం పవన్ కల్యాణ్ పోరాడాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *