-2023, 2024 సంవత్సరాల ‘అంతరాష్ట్ర యోగా దివస్ మీడియా సమ్మాన్ అవార్డులు’ ఈ ఏడాది ప్రదానం
న్యూదిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
‘అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2024’ నిర్వహణ కోసం సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ&బి), ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించాయి. ఐ&బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మీడియా & ప్రచార కార్యక్రమాల సన్నాహాలను ఈ రోజు సమీక్షించారు. ఏటా జూన్ 21న “అంతర్జాతీయ యోగా దినోత్సవం” నిర్వహిస్తారు.
యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయడంతో పాటు ‘కామన్ యోగా ప్రోటోకాల్’పై (సీవైపీ) అవగాహన కల్పించడానికి సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖలోని మీడియా విభాగాలు విభిన్న కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రసార భారతి, న్యూ మీడియా వింగ్ సహా వివిధ మీడియా విభాగాలు కీలక కార్యకలాపాలను రూపొందిస్తున్నాయి.
దూరదర్శన్ (డీడీ)/ఆల్ ఇండియా రేడియో (ఎయిర్) ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రసార భారతి ప్రసారం చేస్తుంది. ఉదయం పూట ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలతో పాటు యోగా నిపుణులతో కార్యక్రమాలు/ముఖాముఖి వంటివాటిని దూరదర్శన్ ప్రసారం చేస్తుంది.
యోగాను జీవన విధానంగా ప్రోత్సహించే కార్యక్రమాలను ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ ‘మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా’ సహకారంతో ఈ కార్యక్రమాలు రూపొందిస్తుంది. అన్ని మీడియా వేదికల్లో ప్రసారం చేయడానికి ‘యోగగీత్’ను ఆయుష్ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది.
‘అంతరాష్ట్ర యోగా దివాస్ మీడియా సమ్మాన్’ (ఏవైడీఎంఎస్) పురస్కారాలతో ప్రైవేట్ మీడియా సంస్థలను సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది. యోగా సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రింట్, టీవీ, రేడియో సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించేందుకు మంత్రిత్వ శాఖ 2023 జూన్‌లో ఈ పురస్కారాలను ఏర్పాటు చేసింది. ‘బెస్ట్ మీడియా కవరేజ్ ఇన్ యోగా ఇన్ న్యూస్ పేపర్’, ‘బెస్ట్ మీడియా కవరేజ్ ఇన్ యోగా ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా (టీవీ)’, ‘బెస్ట్ మీడియా కవరేజ్ ఇన్ యోగా ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా (రేడియో)’ విభాగాల్లో పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత ఏడాది అవార్డులతో పాటు ఈ ఏడాదికి సంబంధించిన అవార్డులను ఈ సంవత్సరం యోగా వేడుకలు పూర్తయిన తర్వాతి రోజున అందజేస్తారు.
ఐ&బి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ‘కుటుంబంతో యోగా’ వంటి కార్యకలాపాలను న్యూ మీడియా వింగ్ (ఎన్‌ఎండబ్ల్యూ) నిర్వహిస్తుంది. కుటుంబంతో కలిసి యోగా చేయడం, యోగాగీత్‌ను ఉపయోగించి రీల్స్ అప్‌లోడ్ చేయడం వంటి పోటీలు పెడుతుంది. దీంతోపాటు ‘యోగా క్విజ్ – గెస్ ది ఆసన్’ కూడా నిర్వహిస్తుంది. ఐడీవై 2024 పాడ్‌క్యాస్ట్‌ను ప్రసారం చేస్తుంది.
ఐ&బి మంత్రిత్వ శాఖలోని వివిధ మీడియా విభాగాలు, సంస్థలు ఐడీవైకి ముందస్తు సన్నాహాలుగా యోగాపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాయి. ఉద్యోగుల్లో యోగా అలవాటును ప్రోత్సహించడానికి యోగా శిబిరాలు, సెమినార్లు వంటివి ఏర్పాటు చేస్తాయి.
జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించినప్పటి నుంచి ఏటా ఐడీవై వేడుకల స్థాయి పెరుగుతోంది. యోగాను విశ్వవ్యాప్తం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 సందర్భంగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 135 దేశాల ప్రతినిధులు పాల్గొన్న వేడుకలకు భారత ప్రధాన మంత్రి నేతృత్వం వహించారు. ఆ యోగా వేడుకల్లో 135 దేశాలు పాల్గొని గిన్నిస్ రికార్డ్ సృష్టించాయి. ఏటా కొత్త కార్యక్రమాలను జత చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో, భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ సమక్షంలో 15,000 మంది ఔత్సాహికులు పాల్గొని కామన్ యోగా ప్రోటోకాల్ ప్రదర్శించారు.
రక్షణ, విదేశీ వ్యవహారాలు, నౌకాశ్రయాలు & జలమార్గాల మంత్రిత్వ శాఖల ప్రోత్సాహంతో 34 దేశాల్లో 19 నౌకల సిబ్బంది యోగా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీనిని ‘ఓషన్ రింగ్ ఆఫ్ యోగా’ అని పిలిచారు. భారతదేశ పరిశోధన స్థావరాలు హిమాద్రి, భారతితో సహా ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు యోగా ప్రదర్శనలు జరిగాయి. యోగాసనాలతో భారత సాయుధ దళాలు ‘యోగా భారతమాల’ను సృష్టించాయి. ‘యోగా సాగరమాల’ పేరిట భారతదేశ తీర ప్రాంతాల్లోనూ యోగముద్రలు ప్రదర్శించారు.
క్షేత్ర స్థాయిలో పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు వంటి 2,00,000 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా, ‘హర్ ఆంగన్ యోగా’ కార్యక్రమాల ద్వారా గ్రామీణ భారతం అనుసంధానమైంది. ఐడీవై 2023 వేడుకల్లో 23.4 కోట్ల మంది పాల్గొన్నారని అంచనా వేశారు.