-సీఎంఓహెచ్‌లు డిఎంహెచ్వోలతో సమన్వయం చేసుకోవాలి
-విజయవాడ, గుంటూరులలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకూడదు
-సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టిని సారించాలి
-మలేరియా, డెంగ్యూ వ్యాపించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
-డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో డయేరియా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విజయవాడ, గుంటూరు నగరాల్లో చోటుచేసుకున్న డయేరియా సంఘటనలు మరే ఇతర నగరాల్లోనూ పునరావృతం కాకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఎస్.వెంకటేశ్వర్ (Commissioner of Health and Family Welfare Dr S.Venkateswar) సూచించారు. ఈ విషయంలో ఆయా నగరాల సిఎంఓహెచ్‌లు(Chief Medical officer of Health) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల(District Medical and Health Officers)తో సమన్వయం చేసుకోవాలన్నారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన అన్ని జిల్లాల డిఎంహెచ్వోలు, డిఎంవోల(District Malaria officers)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో డయేరియా ప్రబలడంలో సిఎంఓహెచ్‌ల వైఫల్యం కనపడుతోందన్నారు. డిఎంహెచ్వోలతో సిఎంఓహెచ్‌లు సమన్వయం చేసుకుంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. డయేరియా విషయంలో మునిసిపల్ కార్పోరేషన్ల కమీషనర్లతో తాను స్వయంగా మాట్లాడుతున్నానన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో నీటి శాంపిళ్ల పరీక్ష కోసం ఐపిఎం (Instt of preventive Medicine) తో సమన్వయం చేసుకోవాలని, ఐపిఎం వద్ద ఉన్న నాలుగు మొబైల్ వాహనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో నీటి శాంపిళ్ల పరీక్షల విషయంలో సిహెచ్‌వోలు మరింత శ్రద్ధ కనబర్చాలన్నారు. తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం నగరాల్లో మలేరియా, డెంగ్యూ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుపతిలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సి ఉందన్నారు. యుపిహెచ్‌సీల(Urban Public Health Centres) వారీగా మలేరియా, డెంగ్యూ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. కీటక జనిత వ్యాధులపై (Vector Born diseases) భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర స్థాయి అధికారుల్ని ఆదేశించారు. దోమల నివారణ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దని కమీషనర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరల్ని సరిపడా సరఫరా చేయాలని, అలాగే గిరిజన సంక్షేమ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్ల పై దృష్టి సారించాలన్నారు. త్వరలో స్కూళ్లు తెరుస్తున్నందున ఇప్పట్నించే కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ పై దృష్టి పెట్టాలని ఆయా జిల్లాల డిఎంహెచ్వోలను కమీషనర్ ఆదేశించారు. జీరో ప్రసవాల విషయంలో డిఎంహెచ్వోలే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల పై నిఘా పెట్టాలనీ, జిల్లాల్లో ఐఎంఎ (Indian Medical Assn)ప్రతినిధులతో డిఎంహెచ్వోలు సమావేశమై వారి సూచనలు , సలహాలు తీసుకోవడం ద్వారా అడ్డుకట్ట వెయ్యొచ్చునని కమీషనర్ సూచించారు. కేస్సర్ స్క్రీనింగ్ (Cancer Screening)కు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి సిహెచ్వోల(Community Health Officers)కు దీని గురించి అర్థమయ్యేలా తెలియజెప్పాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ విజయవంతమయ్యేందుకు డిఎంహెచ్వోలు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాలని, తద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మాతృ శిశు(Maternal and Child health) ఆరోగ్య సంరక్ణణ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కనబర్చొద్దని, మాతృ శిశు మరణాల నివారణే (Prevention of Maternal and Child Deaths) లక్ష్యంగా అంకిత భావంతో పనిచేయాలని కమీషనర్ డాక్టర్ యస్.వెంకటేశ్వర్ సూచించారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్(Director of public Health and Family welfare) డాక్టర్ పద్మావతి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, ఎన్‌హెచ్ ఎం స్టేట్ ప్రోగ్రాం మేనేజర్(NHM SPM) డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్, ఎన్‌హెచ్ఎం సిఎఓ(NHM CAO) ఆర్.గణపతిరావు, ఏడీలు, డీడీలు, పీవోలు వీడియో కాన్ఫరెన్ష్‌లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News