-కలెక్టర్ ప్రవీణ్ కుమార్
-జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన బిఎల్వో స్థాయి నుండి అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలియచేసిన బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్
-తిరుపతి జిల్లాలో కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ గారు పని చేసిన సమయంలో వారి అమూల్యమైన సేవలు మరువలేనివి
-బదిలీ పై వెళ్తున్న ప్రియతమ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎంతో అనుభవజ్ఞులు, సౌమ్యులు, అనుసరణీయలు: జెసి ధ్యాన చంద్ర
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన బిఎల్వో స్థాయి నుండి అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలని, ఇది మనకు దేవుడు ఇచ్చిన సదవకాశం అని జిల్లా నుండి కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు ఎఫ్ఎసి ఎండీ, ఏపీఎండిసి గా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ కి ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఏ విధమైన విధి విధానాలు అవలంబించామనేది డాక్యుమెంటేషన్ చేయడం రాబోయే ఎన్నికల నిర్వహణకు దిక్సూచిగా ఉపయోగ పడుతుందనీ తెలిపారు. తాను కలెక్టర్ గా మూడు సార్లు పనిచేసి తిరుపతి జిల్లాలో ఈసిఐ ఆదేశాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో నాలుగవ సారి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి సుమారు మూడు నెలల సమయంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా చేపట్టడం జరిగిందనీ తెలిపారు. విపత్తు, ఎన్నికలు ఎప్పుడూ పూర్తి అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని, యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి మినహాయింపు ఉండదని తెలిపారు. ఎన్నికల సక్రమ నిర్వహణలో బిఎల్వో స్థాయి నుండి ఇతర ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ బాధ్యతగా తమ ఎన్నికల విధులను నిర్వర్తించడం ద్వారా దేశ స్థాయిలోనే సెన్సిటివ్ జిల్లాగా గుర్తించిన తిరుపతి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎప్పుడైనా పనిచేయడమే కాదు పని చేసిన విజిబిలిటి కూడా ఉండాలని, నీతి నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటానని స్పష్టం చేశారు. టీం వర్క్ లాగా అందరూ కలిసి కట్టుగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది అందరూ చాలా చక్కగా పని చేసారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు తమ సేవలు అంకిత భావంతో అందించాలని, దేవుడు ఇచ్చిన సదవకాశం అని భావించాలని సూచించారు. తాను జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన సమయంలో సహకరించిన అదరికి పేరు పేరునా, అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర అధికారిగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు ఎఫ్ఎసి ఎండీ, ఏపీఎండిసి గా బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ఎంతో అనుభవజ్ఞులు, సౌమ్యులు, అనుసరణీయులు అని, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని జెసి ధ్యాన చంద్ర కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటరీ స్థాయి అధికారి, అనుభవజ్ఞులు అయిన మన ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గా మన జిల్లాకు ఈసిఐ ఆదేశాల మేరకు రావడం వారికి తిరుమల శ్రీవారి చెంత పని చేసే అదృష్టం కలిగిందనుకుంటే, మన జిల్లాకు, మన అధికారులకు అందరికీ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ ఎంతో మార్గదర్శకంగా ఉంటూ సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని, వారి వద్ద పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
డిఆర్ఓ మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న కలెక్టర్ నుండి పలు అంశాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయని, వారు సమర్థవంతమైన అధికారి అని కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి అంతా ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, మరిన్ని మంచి పదవులు పొందాలని, ఆయు ఆరోగ్యాలతో వారు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం అర్చకులు కలెక్టర్ కు ఆశీర్వచనం పలుకగా, అధికారులు, సిబ్బంది అందరూ కలెక్టర్ ని సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.