విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడం ఏపీకి శుభవార్తే. ఆ ఫైల్ పెండింగ్ లో ఉందని పేర్కొనడం విశేషం. విశాఖ ఉక్కు ప్రజలు, ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ప్రస్తుతం విశాఖ ఉక్కు కొనుగోలు చేసే సంస్థ లేదని చెప్పడం కేంద్రం అమ్మాలనే ప్రతిపాదన వాయిదా వేసుకుందని తెలుస్తున్నది. అదీకాక రూ.3000 కోట్లు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు మరో శుభవార్త చెప్పడం గమనార్హం. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయాలనే ప్రతిపాదన శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
కౌరవుల సభకు వెళ్లాల్సి ఉంది
కేవలం 11స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా లభించని వైసీపీ రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత జగన్ మనం కౌరవ సభ కు వెళుతున్నామని అనడం విశేషం.అంటే హాజరవుతారని భావించాలి. ‘జగన్ ఓడిపోయాడు, చనిపోలేదని ఒకరు అంటారు. చచ్చేవరకూ కొట్టాలని మరొకరంటారు.ఇలాంటి కౌరవుల సభకు వెళ్లాల్సి ఉందని’ జగన్ వ్యాఖ్యానించారు.గతంలో అసెంబ్లీలో తన కుటుంబానికి జరిగిన అవమానానికి చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత సభకు వస్తానని శపథం చేసి గెలిచి సభలో అడుగు పెట్టనున్నారు. ఇప్పుడు ఇది కౌరవ సభ అని జగన్ నోటి వెంట రావడం గమనార్హం.’మనకు 40శాతం ఓట్లు వచ్చాయి, 2019తో పోలిస్తే 10 శాతం మాత్రమే తగ్గాయి. ఈ పదిశాతం ప్రజలు చంద్రబాబు చేసే మోసాలు,ప్రలోభాలను త్వరలో గుర్తిస్తారు.ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి తెలుసు. విశ్వాసనీయత కు వైసీపీ చిరునామా.అదే మనకు శ్రీరామరక్ష. 2019లో గొప్ప విజయంతో మనకు అధికారం ఇచ్చారు.మళ్లీ ఇస్తారు.బాబు పాపాలు శిశుపాలునిలా పండే సరికి ప్రజలు మనవేపుకు వస్తారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిబెట్టుకోరని గతంలోనే రుజువయ్యాయి. నేను ఇప్పటికీ అదే చెబుతున్నా. కాని ప్రజలు ఈసారి బాబును నమ్మి ఓటేశారు.మళ్లీ గతం పునరావృతం అవుతుంది. అవే మనకు వరాలు కానున్నాయి. తప్పక 2029లో మళ్లీ అధికారం ఖాయం.ప్రస్తుతఅసెంబ్లీలో మనం చేసేది తక్కువ. రేపు స్పీకర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియా లో చూస్తున్నాం’అని వ్యాఖ్యలు చేయడం ఆయనలోని ఆశ, నిరాశలు ప్రతిబింబిస్తున్నాయి.21,22తేదీల్లో ప్రమాణ స్వీకారోత్సవానికి అసెంబ్లీకి జగన్ హాజరవుతారా, బహిష్కరణా అనే నిర్ణయం తీసుకున్నట్టు లేదు.అపరిమితమైన బలం ఉన్న ఎన్డీఏ ను ఎదుర్కొనడం అంత తేలిక కాదు. తమకు జరిగిన అవమానాలకు ప్రతీకారానికి అధికారపక్షం కాచుకు ఉందనేది ఆయనకు తెలియంది కాదు. జగన్ ను ఎటాక్ చేయడానికి టీడీపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుందనడంలో సందేహంలేదు. కాని అది డైరెక్టా లేక ప్రజాస్వామ్య పద్దతిలోనా అనేది తేలాల్సిఉంది.మరో రెండు వారాల్లో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి.వాటికి హాజరవుతారా అనేదీ కూడా నిర్ణయం కాలేదు.2014 సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడంపై నిరసనగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం జగన్ తీసుకున్నారు. ఈ సారీ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాలని నిర్ణయించే అవకాశం ఉంది.కాని పోరాడే తత్వమున్న జగన్ ఆ నిర్ణయం తీసుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత జగన్ కు ప్రభుత్వభవనాలలో ఉండే ఖర్మ పెట్టలేదని వ్యాఖ్యానించారు. బాబు హామీలు ఎలానెరవేర్చాలో తెలియక పోలవరం, అమరావతి చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించడం గమనార్హం. హామీల అమలు కోసం టీడీపీ వెంట పడతామని, జగన్ కొద్దిరోజులు సమయం ఇద్దామని అన్నారని చెప్పడంపై అధికారపార్టీ పై అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
Prajavartha Online Telugu News