గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అతిపెద్ద పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం మంత్రి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి గన్నవరం మండలం మల్లవల్లి, బాపులపాడు మండలం వీరపనేని గూడెం పారిశ్రామిక వాడలను సందర్శించి పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ రెండు పారిశ్రామిక వాడల్లో విద్యుత్తు కోతల వల్ల ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నదని, తద్వారా నష్టం వాటిల్లుతున్నదని పారిశ్రామికవేత్తలు మంత్రికి వివరించారు. వెంటనే మంత్రి విద్యుత్ అధికారులను పిలిచి సమస్య కారణాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ స్టేషన్లో సిబ్బంది కొరత సమస్య పరిష్కరించాలని, విద్యుత్తు నిర్వహణ పక్కాగా నిర్వహించి కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సమస్య పునరావృతం కారాదని హెచ్చరించారు. పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చాలా ముఖ్యమని పారిశ్రామికవేత్తగా పరిశ్రమ దారుల సమస్యలు తనకు తెలుసని అన్నారు. అశోక్ లేలాండ్ వంటి పెద్ద పారిశ్రామిక బ్రాండెడ్ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. పారిశ్రామి వాడలలో బస్సు షెల్టర్, పోలీస్ పికెట్ వంటి కనీస వసతులు లేకపోవడం శోచనీయమని, వెంటనే ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. నీటి సమస్య పరిష్కరించాలన్నారు. ఏపీని అభివృద్ధి రోల్ మోడల్ గా చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు. మల్లవల్లి, వీరపనేని గూడెం పారిశ్రామిక వాడల గుర్తింపునకు ప్రవేశ ద్వారాలను నిర్మించాలని, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక వాడల చుట్టూ కంచె/ ప్రహరీ నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థ పక్కాగా ఏర్పాటు చేయాలని, గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి గ్రీనరీ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ కు, అధికారులకు సూచించారు. గన్నవరం శాసనసభ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి సహకారంతో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పారిశ్రామిక వాడల్లో భూ సమస్యలు కనీస వసతుల కల్పన, తదితర అంశాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మంత్రి, శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ అశోక్ లేలాండ్ ప్రతినిధులతో కలిసి అశోక్ లేలాండ్ లేఔట్ సందర్శించారు. గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్, జోనల్ మేనేజర్ సీతారాం, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, విద్యుత్తు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు
Tags gannavaram
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …