మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించిన రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని రాష్ట్ర గనులు, జియాలజీ Ê ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి ప్రారంభించారు. రేషన్ షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేస్తామని, ప్రతి ఒక్క లబ్ధిదారుడు రేషన్ సరుకులు వినియోగించుకోవాలి అని సూచించారు. రేషన్ మాఫియా లేకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటైన రేషన్ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. టీడీపీ ప్రభుత్వం బియ్యం కందిపప్పు సహా 8 రకాల సరుకులు అందించింది. వైసిపి పాలనలో బియ్యం తప్ప మరో సరుకు అందించిన పాపాన పోలేదు. రాష్ట్రంలో నేడు ప్రజా పాలన ప్రారంభమైంది. ఇక నుండి ప్రతి ఒక్కరికీ మేలు జరగబోతోంది. పేదలకు అన్నిరకాల సరుకులు అందించేలా ప్రణాలికలు రూపొందిస్తాం. రేషన్ పంపిణీలో ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నా, తప్పులు జరిగినా తన దృష్టికి తీసుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం వాణి, డీఎస్ఓ వి. పార్వతి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, తాసిల్దారు వెంకటేశ్వరరావు తదితర అధికారులతో పాటు స్థానిక నాయకులు బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్ ,కుంచె నాని, లంకె నారాయణ ప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, గోపు సత్యనారాయణ, ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.