-వైదిక, స్మార్త, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీ వైష్ణవ, గ్రామ దేవత ఆగమములో ప్రవేశ, వర, ప్రవరస్థాయిలకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు
-20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్ లైన్ లో అప్లికేషన్ లు సమర్పించాలని వెల్లడి
-40 సంవత్సరాల వయస్సు నిండిన వారికి వ్రాత పరీక్షల నుండి మినహాయింపు
-వివరాలు వెల్లడించిన ఆగమ పరీక్షల కంట్రోలర్, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె. రామచంద్ర మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగమ పరీక్షలు -2024కు సంబంధించిన వివరాలను ఆగమ పరీక్షల కంట్రోలర్, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వైదిక, స్మార్త, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీ వైష్ణవ మరియు గ్రామ దేవత ఆగమములో ప్రవేశ, వర, ప్రవరస్థాయిలకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రకటన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. అదే విధంగా కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానమైన విద్యా పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు సంబంధిత సంస్థ నుండి లేదా గురువు వద్ద నుండి ధృవీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుందన్నారు. పరీక్ష రుసుము రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
40 సంవత్సరాల వయస్సు నిండిన అభ్యర్థులను మాత్రమే వ్రాత పరీక్షకు మినహాయిస్తామన్నారు. వారు గెజిటెట్ అధికారిచే ధృవీకరించబడిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ను జతపర్చాల్సి ఉంటుందన్నారు. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే తప్పనిసరిగా ఓరల్ మరియు వ్రాత (ప్రాక్టికల్) పరీక్ష రాయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. వర మరియు ప్రవర రాసే అభ్యర్థులు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన ప్రవేశ మరియు వర పరీక్షల యోగ్యతా పత్రాలను దరఖాస్తుతో పాటు జతచేయాల్సి ఉంటుందన్నారు.
పరీక్షలు రాసే అభ్యర్థులు తమ దరఖాస్తులను 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్ లైన్ లో apendts.archakaexaminations.com వెబ్ సైట్ లో సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు వెబ్ సైట్ లో లేదా ఆఫీస్ పనివేళల్లో 08645 273139, 9491000607, 9440682996 ఫోన్ నంబర్ లను సంప్రదించాలని ఆగమ పరీక్షల కంట్రోలర్, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సూచించారు.