Breaking News

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతించిన డాక్టర్ పి.వి . రమేష్ రిటైర్డ్ ఐఎయస్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
లోప భూయిష్టమైన రైతుల పాలిట యమపాసంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నూతన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటం పట్ల రిటైర్డ్ ఐఎయస్ అధికారి, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి డా!! పి.వి. రమేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని హోటల్ దస్ పల్లా లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి – తక్షణ కర్తవ్యాలపై జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డా!! పి.వి. రమేష్ ప్రసంగిస్తూ గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులలో గందరగోళ పరిస్థితి కల్పించిందని, భూ కబ్జాలు, అక్రమణకు అవకాశం కల్పించిందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులను కోల్పోయిందని అన్నారు. 58 శాతం జనాభా తో 46 శాతం మాత్రమే ఆదాయాన్ని పొందినామన్నారు. 42 శాతం జనాభా గల తెలంగాణ 54 శాతం ఆదాయాన్ని పొందిందని తెలిపారు. అభివృద్ధి కి కేంద్రమైన హైదరాబాద్ ను కోల్పోయినామన్నారు. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలలో కల్లా అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా మారిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అతి తక్కువ పట్టణీకరణ జరిగిన రాష్ట్రంగా వుందన్నారు. భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా 20శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 38 శాతం వుందన్నారు. నూతన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రకటించిందని తెలిపారు. ఇవి గాక మరో రెండు లక్షల కోట్లు రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటి ఇచ్చిందని, ప్రభుత్వ రాబడిని , ఆస్తుల ను సహితం తాకట్టు పెట్టి ఋణాలు పొందారని తెలిపారు. సామాజిక, సాంస్కృతిక రంగాలు అభివృద్ధి చెందితేనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. 1990లో ఇండియా, చైనా దేశాల తలసరి ఆదాయం సమానంగా ఉంటే నేడు చైనా మన కన్నా ఐదు రెట్లు అధికంగా తలసరి ఆదాయం కల్గి వుందన్నారు. భారత జనాభాలో 35 సంవత్సరాల లోపు వారు 65 శాతం ఉన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 33 శాతం బాలికలు పౌష్టిక ఆహార లేమితో బాధపడుతున్నారని, 12 శాతం నిరుద్యోగిత కొనసాగుతుందని తెలిపారు. చిన్న పరిశ్రమలలో ఉత్పాదకతను పెంచడానికి, వ్యవసాయ రంగంలో ఉత్పాతకతను పెంచడానికి కృషి జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ధనవంతులు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నారని, వారందరూ ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని కల్పించాలన్నారు. మంచి విద్య, వైద్య సదుపాయాలు కల్పనకు ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలన్నారు. పరిపాలన, అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు రాష్ట్రానికి రప్పించుకోవాలని, ఆయా ప్రాజెక్టులకు కావలసిన భూమి, నగదు వాటాను చెల్లించి ప్రాజెక్టులను, స్కీంలను రాష్ట్రానికి తెప్పించుకోవాలన్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ భావన మంచిదని, దీని అమలు కోసం ఐక్యంగా కృషి జరగాలన్నారు, ఎన్ ఆర్ ఐ, సి ఎస్ ఆర్ ఫండ్స్ ల ను వినియోగించుకొని సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శాతం ధనవంతుల చేతిలో 40 శాతం ఆస్తులు ఉన్నాయని కింద ఉన్న 50 శాతం ప్రజల చేతుల్లో 14శాతం ఆస్తులు మాత్రమే ఉన్నాయన్నారు. ఇలాంటి అసమనాతలను తగ్గించడానికి ఆస్తులపై, సంపదలపై పన్నులు విధించి, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దూర విద్యా కేంద్రం పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ పి హరి ప్రకాష్, పూర్వ వైస్ ఛాన్సలర్స్ ఆర్. సుదర్శన్ రావు, ఎస్. రామ క్రిష్ణారావు, ప్రొఫెసర్ అవధాని, ప్రొఫెసర్ మురళీకృష్ణ, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు, డా. గంగా రామ్, మారుపల్లి పైడ రాజు, రామారావు, హౌనాక్, ప్రగడ వాసు తదితరులు ప్రసంగించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *