Breaking News

మౌళిక సదుపాయాలు-పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

-పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, డ్రోన్, టవర్, కంటెంట్, గ్యాస్ కార్పోరేషన్లపై సమీక్ష
-రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ లు….కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, మూలపేటలలో నిర్మాణం
-2014 -19లో ప్రతిపాదిత ఎయిర్ పోర్టులను పూర్తి చెయ్యాలని నిర్ణయం
-ప్రతిష్టాత్మక ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్న సిఎం
-వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాలి :- సీఎం నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2014 -19 మధ్య కాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభిస్తే….వాటన్నింటినీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం కక్ష పూరితంగా రద్దు చేసిన, నిలిపివేసి అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మౌళిక సదుపాయాలు-పెట్టుబడుల శాఖపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మౌళిక సదుపాయాల ప్రాజెక్టులను నిలిపివేసి సంపద సృష్టి కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని…మళ్లీ ఆ ప్రాజెక్టులు గాడిన పెట్టి…త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు, ఎపి మారిటైం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్, వివిధ ప్రాజెక్టుల్లో స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఎపి ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని సిఎం అన్నారు. వివాదాలకు తావు లేకుండా అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఏపీ మారిటైం మాస్టర్ ప్లాన్ తో పాటు మారిటైం పాలసీ తీసుకువస్తామన్నారు. నాడు సుదీర్ఘ కసరత్తు చేసి తలపెట్టిన ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నాడు ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ లలో ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్ ల నిర్మాణంతో పాటు శ్రీకాకుళం జిల్లా మూలపేట ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయడంతో పాటు భూసేకరణ కూడా పూర్తి అయ్యిందని…అయితే గత ప్రభుత్వం వీటిని నిలిపివేసిందని సీఎం అన్నారు. మళ్లీ ఈ ఎయిర్ పోర్టుల నిర్మాణం కార్యరూపం దాల్చాలని ఆదేశాంచారు. రాష్ట్రంలో మొత్తం 12 నుంచి 14 చోట్ల ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్ లు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో కూడా ఎయిర్ పోర్టులు/ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించే అంశంపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కర్నూలు ఎయిర్ పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేష్ వంటి సంస్థలను తీసుకురావాలన్నారు. ఎయిర్ పోర్టుల ద్వారా సరుకు రవాణా చేసేలా ప్రాజెక్టులు రూపకల్పన చేయాలని సీఎం అన్నారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, నేషనల్ హైవేలు అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగ కల్పనతో పాటు వేగవంతమైన అభివృద్ధి సాధించవచ్చని సిఎం అన్నారు.

ఎపి ఏవియేషన్ కార్పొరేషన్ ను జిఎడి పరిథిలోకి, ఎపి డిజిటల్ కార్పొరేషన్ ను ఐ అండ్ పిఆర్ పరిథిలోకి తీసుకురావాలి అని సిఎం అన్నారు. ఎపి టవర్స్ కార్పొరేషన్ ను ఎపి స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో విలీనం చేయాలన్నారు. ఒక మంచి లక్ష్యంతో నాడు ఎపి ఫైబర్ నెట్ ప్రాజెక్టును తీసుకొస్తే దానిపైనా విషం చిమ్మి బంగారం లాంటి ప్రాజెక్టును నాశనం చేశారని సిఎం అన్నారు. కరెంట్ స్థంభాల ద్వారా ఫైబర్ నెట్ ఏర్పాటు చేసి కేవలం 10 శాతం ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. 24 వేల కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ నిర్మాణం చేసి 9 లక్షల కనెక్షన్ లు ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వ రివర్స్, అసమర్థ పాలన వల్ల 9 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్ లు 5 లక్షలకు పడిపోయాయని…వాటిలో కూడా నాణ్యమైన సేవలు అందించలేదని సిఎం అన్నారు. నాడు నెలకు రూ.149 లకే సెట్ టాప్ బాక్సుల ద్వారా ఇంటర్ నెట్, కేబుల్ టీవీ ప్రసారాలు అందిస్తే….వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రూ.1258 కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, ఎపి టవర్స్ కార్పొరేషన్, గ్యాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లను కూడా మళ్లీ గాడిలో పెట్టి సేవలు పునరుద్దరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాడు జిల్లాల్లో నిర్మాణం తలపెట్టిన ఆర్టిజి సెంటర్లు పూర్తిచేయాలని సూచించారు. సీసీ కెమెరా నెట్ వర్క్ ను వీటికి అనుసంధానం చేయాలని సిఎం అన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *