-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాం గేటు వూడిపోయిన నేపథ్యంలో ఏపీ నీటిపారుదల శాఖామంత్రి, ఉన్నతాధికారులు సందర్శించి, యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి తుంగభద్ర డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం రాత్రి కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్లు మూస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో 35 వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోతోంది. డ్యామ్ గేటు ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పల్లపు ప్రాంతాల ప్రజలు వరద బారినపడే ప్రమాదముంది. అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన ఘటన గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. తుంగభద్రలో నీళ్లు లేకుంటే రాయలసీమ కరువుతో అల్లాడుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి, ఉన్నతాధికారులు తక్షణమే తుంగభద్ర ద్యాంను సందర్శించాలి. యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టాలి. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.