-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు గురువారం జరిగిన వేడుకలలో వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినమన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు ఆనాడు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. “స్వరాజ్యమే నా జన్మహక్కు” అని ప్రకటించిన బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయులు సామాన్య ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ రాకతో స్వాతంత్య్రోద్యమంలో ఓ విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుందన్నారు. అలాగే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విజయవాడకు ఘనమైన చరిత్రే ఉందని.. స్వాతంత్ర్య ఉద్యమాలకు సంబంధించి అనేక కీలకమైన నిర్ణయాలను ఇక్కడే తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. గాంధీ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో జిల్లా నుంచి ఎందరో ఉద్యమకారులు పుట్టుకొచ్చారని వెల్లడించారు. పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు.. ఇలా ఎందరో మహనీయులు భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు ప్రాణాలొడ్డి పోరాడారని వివరించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం త్రివర్ణ శోభితమై కోట్లాది మంది హృదయాల్లో నిలిచిందన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా గాంధీ మహాత్ముడు విజయవాడలో పర్యటించినప్పుడు.. ఆయన ఉపన్యాసాన్ని అయ్యదేవర కాళేశ్వరరావు అనువదించారని చెప్పుకొచ్చారు. ఆ త్యాగధనుల పోరాటాలు భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో పేజీలుగా మారాయన్నారు. వారి ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లడమే.. ఆ మహనీయులకు మనం అర్పించే నిజమైన నివాళి అని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు డాక్టర్ ఈశ్వర్, చల్లా సుధాకర్, రంగబాబు, మైలవరపు రామకృష్ణ, మురళికృష్ణం రాజు, మంగళంపల్లి చంటి, చాంద్ శర్మ, కొప్పవరపు మారుతి, జె.కె.సుబ్బారావు, మందా రాంబాబు, తాడంకి భాస్కర్, నాదెండ్ల రవిశంకర్, భోగాది మురళి, పరసా శ్రీనివాస్, విప్పర్ల మధు, తదితరులు పాల్గొన్నారు.