Breaking News

మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

-ఏపీ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహిళా అధ్యయన కేంద్రం, స్టూడెంట్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ సమన్వయం తో సోమవారం యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఏపీ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ… అక్రమార్జన ప్రధాన ధ్యేయంగా, వివిధ మార్గాల ద్వారా మాదకద్రవ్యాల రవాణా జరుగుతూ, వయోభేదం లేకుండా ముఖ్యంగా విద్యార్థులను ఈ వ్యసనానికి బానిసలుగా చేస్తూ వారి బంగారు జీవితాలను నిర్వీర్యం చేస్తూ ఉండడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం మహిళా రక్షణకై అనేక చట్టాలను తీసుకువస్తూ, శిక్షలను కఠినతరం చేస్తున్నప్పటికీ విచక్షణారహితంగా మహిళలపై, పిల్లలపై దారుణమైన నేరాలు, ఘోరాలకు పాల్పడుతూ ఉండడానికి డ్రగ్స్ మహమ్మారి కూడా ప్రధాన కారణమని అన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణిని వీడనాడాలని. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి బాధ్యతయుతమైన పాత్రను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య వెన్నెం ఉమ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగం, దానివల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికీ సమగ్ర అవగాహన అవసరమని అన్నారు . విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ రహిత వాతావరణాన్ని నెలకొల్పడానికి తమ సహకారం ఎల్లవేళలా అందజేస్తామని తెలియజేశారు.

అనంతరం ఈ కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా విచ్చేసిన అడిషనల్ సూపరిన్డెంట్ ఆఫ్ పోలీస్, రాజేంద్ర ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగం అనేది వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం, సమాజం మరియు దేశం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలంటే అన్ని స్థాయిల్లో అవగాహన అవసరమని అన్నారు.

ప్రత్యేక అతిధిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ జానకి రామ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకుంటూ, చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఉజ్వల భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారని, విద్యార్థులు స్నేహితుల ప్రలోభాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని అన్నారు. నైతిక విలువలు, సరైన జీవన శైలిని అలవర్చుకొని విద్య పరమావధిగా పురోగతి వైపు చైతన్యవంతం కావాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్ధాలు మరియు ఎన్.డి.పిఎస్ చట్టం గురించి విద్యార్థులు మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రజని అధ్యక్షత వహించగా, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్ డీన్ మరియు మహిళా అధ్యయన కేంద్ర డైరెక్టర్ ప్రొఫెసర్ సి.వాణి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర సిబ్బంది, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కాత్యాయని, విమెన్ సేఫ్టీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతా కుమారి, స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సుజాతమ్మ, విశ్వ విద్యాలయ వివిధ విభాగాల అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థునులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *