– మంగళాపురం, సీతారాంపురం గ్రామాల్లో పాల సేకరణ
– ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర సాయం
– పాలు, ఆహారం, తాగునీరు అందజేత
– పాల సేకరణకు రెండు గ్రామాల ప్రజల సహకారం అభినందనీయం
– ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ నిరంతర సహాయం అందిస్తోంది. వరద తాకిడితో సర్వస్వం కోల్పోయిన వారికి కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు అందజేస్తున్న ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ.. తమ సేవలకు కొనసాగింపుగా, రూరల్ మండల పరిధిలోని రెండు గ్రామాల నుంచి పాలను సేకరించి వరద బాధితులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ సారథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు మంగళాపురం, సీతారాంపురం గ్రామాల్లోని పాడి రైతుల ఇళ్లలు వెళ్లి.. వరద బాధితుల సహాయార్థం పాలను సేకరించారు. ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రతినిధుల అభ్యర్థనకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 200 లీటర్ల పాలను గ్రామస్తులు ఉచితంగా అందించగా, మరో 350 లీటర్ల పాలను ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం 550 లీటర్ల పాలను అర లీటరు ప్యాకెట్లుగా చేసి, రాజీవ్ నగర్, కండ్రికల్లోని వరద బాధితులకు శుక్రవారం నాడు ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా, వందలాది మంది బాధితులకు అల్పాహారం అందించారు. మూడు ట్యాంకర్ల ద్వారా ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు మంచినీటిని సరఫరా చేశారు. ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ సీఎండీ నాగ భాస్కరరావు మానికొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద బాధితులకు అవసరమైన పాలను అందించాలనే లక్ష్యంతో, మంగళాపురం, సీతారాంపురం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పాల సేకరణ జరిపామని చెప్పారు. తమ అభ్యర్థనకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించిందని, వరద బాధితులకు సేవలందించేందుకు రెండు గ్రామాల ప్రజలు అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. వరద బాధితులకు తమ సంస్థ ద్వారా నిరంతర సేవలందిస్తున్నామని, ముంపు ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొనేంత వరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. అనుకోని విపత్తుతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నాగ భాస్కరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ మార్కెటింగ్ ప్రతినిధులు, రెండు గ్రామాల నాయకులు, యువకులు పాల్గొన్నారు.