-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇసుక రవాణా చేయు వాహనదారులు జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత వాహన దారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు గనులు, భూగర్భ శాఖ, రవాణా శాఖ, ట్రాక్టర్లు, లారీ, టిప్పర్లు యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఇసుకను రవాణా చేయు వాహనదారుల నుండి పలు సూచనలు, సలహాలు తీసుకున్న మేరకు రవాణా చార్జీలను నిర్ణయించడం జరుగుతుంది అని అన్నారు. కావున ఇసుక రవాణా చేయు వాహనదారులు వినియోగదారుల నుండి ఇసుక కమిటీ నిర్ధారించిన రవాణా చార్జీలకు లోబడి వసూలు చేయవలసిందిగా తెలిపారు. సదరు వివరాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అనంతరం జిల్లాలో ఇసుక సరఫరాకు సంబంధించిన వాహనదారుల పలు సమస్యల గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్, జిల్లా రవాణా అధికారి వి. వి. సుబ్రహ్మణ్యం, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు..