-విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పిఎం శ్రీ పాఠశాలలు ఉండాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న ఉరందూరు జడ్పీహెచ్ఎస్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కోనాటి సురేష్ కు జిల్లా యంత్రాంగం తరపున సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలనీ, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యతగా, పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పిఎం శ్రీ పాఠశాలలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్ తో కలిసి ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఇఓ లు, ఉప విద్యాధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన విద్యకు సంబంధించి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని, సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను, నాణ్యతగా, మౌలిక వసతులతో, లైబ్రరీ, లాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపిక అయిన 40 పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంబించాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని సదరు 40 పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన వినూత్న బోధనా పద్ధతులతో, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, క్రీడలు నిర్వహణతో, మౌలిక సదుపాయాల మెరుగుదలతో, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో, విద్యార్థులకు స్పష్టంగా అర్థం అయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ విద్యా శాఖ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి అవార్డు కొరకే కాకుండా విద్య బోధన లో ఒక కొత్త ఒరవడితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 66% నిధులు మరియు 34% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం 2021-22 యు-డైస్ డేటా ఆధారంగా ఎంపిక చేయబడిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలను మౌలిక వసతుల కల్పన, విద్యా బోధన సామాగ్రి తదితర అంశాలకు సహాయం అందజేస్తూ 2022-23 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు అమలులో ఉంటుందని మన జిల్లాలో మొదటి దశ కింద 23 పాఠశాలలు రెండవ దశ కింద 17 పాఠశాలలు ఎంపిక కాబడినాయని వీటిని జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా, బాధ్యతాయుత బాల బాలికలు, విద్యార్థులుగా తీర్చి దిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇంక్లూజీవ్ విద్య అందించేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆ దిశలో జిల్లాలోని 40 పాఠశాలలు పనితీరు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలలో ఆట స్థలాలు ఏర్పాటు, రసాయన శాస్త్ర ప్రయోగశాలల ఏర్పాటు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం, అవలంబిస్తున్న బోధన విధానం, బాలిక విద్య మరియు వారు పాఠశాల లో డ్రాప్ అవుట్ కాకుండా తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. మన బాధ్యతలను, విధులను అంకితభావంతో నిర్వర్తిస్తుంటే వాటంతట అదే మనకు మన పాఠశాలకు గుర్తింపు వస్తుందని తెలిపారు. పాఠశాలలలో బెస్ట్ ప్రాక్టీస్ లను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, విద్యార్థులలో స్కౌట్స్, ఎన్సిసి వంటి భావజాలం అలవర్చాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందేలా స్టూడెంట్ క్లబ్స్, ఎకో క్లబ్స్ వంటివి ఏర్పాటు పాఠశాలలలో చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా డీఈఓ వివరిస్తూ మొదటి దశ కింద 9 సెకండరీ విద్యాలయాలలో, 14 సీనియర్ సెకండరీ విద్యాలయాలలో, కలిపి మొత్తం 23 పాఠశాలల్లో పది కెమిస్ట్రీ ల్యాబ్ లకు ఒక్కొక్కటికి 15.58 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని, ఇరవై ఒక్క పాఠశాలలకు క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు 5 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నవి అని, ఒకేషనల్ ఎడ్యుకేషన్ ను పాఠశాలల్లో అందిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఎన్సిసి, స్కౌట్స్ నిబంధనల మేరకు ఏర్పాటుకు చర్యలు, గణితము, భౌతిక శాస్త్రము బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ రేణిగుంట లో వారు అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, చేపడుతున్న కార్యక్రమాలు హెచ్ఎం వివరించారు. అలాగే వారి పాఠశాలల సంబంధించిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో బెస్ట్ ప్రాక్టీస్ విధానాలు అప్లోడ్ చేయడం జరుగుతోందని తెలిపారు. అలాగే చిల్లకూరు తదితర పాఠశాలల హెచ్ఎం లు వివరించారు.
అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉరంధూరు శ్రీకాళహస్తి కి చెందిన సోషల్ స్టడీస్ టీచర్ కోనాటి సురేష్ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు పొందిన గ్రహీతకు జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ సన్మానం చేశారు. అలాగే ప్రేరణ కార్యక్రమం కింద జిల్లా పరిషత్ హై స్కూల్ సంతవేలూరు, వరదయ్యపాలెం ఉపాధ్యాయురాలు ఎన్వి లత, ఝాన్సీ విద్యార్థిని, బిఎన్ కండ్రిగ కు చెందిన కిషోర్ నాయక్ ప్రధానమంత్రి మోడీ గారు చదివిన పాఠశాలలో కార్యక్రమాలలో పాల్గొన్న వారిని, అలాగే పిఎం శ్రీ పాఠశాల తొండమ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి చంద్రకుమారి ఉపాధ్యాయురాలు, జీవి.శేషి రెడ్డి విద్యార్థి వారిని వారు ఆగస్టు 15 న ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించబడి పాల్గొన్న నేపథ్యంలో వీరికి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పిఎంశ్రీ శివ శంకర్ డిప్యూటీ విద్యాధికారులు శాంతి,ప్రభాకర్ రెడ్డి, బాలాజీ, ఎస్ ఎస్ ఎ సెక్టరాల్ అధికారులు, ఈఈ తదితర అధికారులు పాల్గొన్నారు.