-అంతర మంత్రిత్వ కేంద్ర అధికారులకు వరద నష్టాన్ని వివరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదలకు వ్యవసాయ అనుబంధ రంగాలు, రహదారులు, ఇరిగేషన్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా తదితర రంగాలలో రూ.1200 కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర అధికారుల బృందానికి తెలిపారు. గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఏస్డిఎమ్ఏ) కార్యాలయ భవనంలో బుధవారం మధ్యాహ్నం జిల్లాకు సంబంధించిన వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు వచ్చిన అంతర మంత్రిత్వ కేంద్ర అధికారుల బృందం జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, (IS-I & CS), అనిల్ సుబ్రమణియం నాయకత్వంలో
కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ, చీఫ్ ఇంజనీరు రాకేష్ కుమార్,
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, హైదరాబాద్ సైంటిస్ట్ డాక్టర్. ఎస్ వి ఎస్ పి శర్మ సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల అధిక వర్షాలు, వరదలకు జిల్లాలో సంభవించిన నష్టం వివరాలను అంతర మంత్రిత్వ కేంద్ర బృందానికి తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలను తెలియజేస్తూ భారీ వర్షపాతం, ఎగువ నుంచి కృష్ణా నదికి భారీ మొత్తంలో వరద నీరు రావడం, బుడమేరు పొంగి ప్రవహించటంతో పాటు గండ్లు పడటం జిల్లాలో అధిక నష్టం వాటిల్లడానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
కృష్ణానదికి 1903వ సంవత్సరంలో 10.61 లక్షల క్యూసెక్కులు, 2009లో 10.94 లక్షల క్యూసెక్కుల వరద నీరు అధిక మొత్తంలో రాగ, 2024 సంవత్సరం సెప్టెంబర్ లో వచ్చిన 11.43 లక్షల క్యూసెక్కుల వరదే చరిత్రలో అత్యధికమని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా దుఃఖదాయని అయిన బుడమేరు కృష్ణా జిల్లాలో 56 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తూ మొన్నటి వరదలకు 45 వేల క్యూసెక్కుల వరదనీరు తీసుకురావడంతో పరిసర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు, పంటలు ముంపు బారిన పడి అధిక నష్టం వాటిల్లిందని వివరించారు. 1964లో 40,594 క్యూసెక్కుల వరదనీరు వచ్చిన సంగతిని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.
గత ఆగష్టు నెలలో కురిసిన 120 సెంటీమీటర్ల భారీ వర్షం, వరద ముంపు వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా రంగానికి అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని, ముంపుకు గురయ్యి రహదారులు, గృహాలు, పరిశ్రమలు సైతం దెబ్బతిన్నాయని వివరించారు.
ప్రస్తుత ప్రకృతి వైపరీత్యం వల్ల జిల్లాలో వ్యవసాయం రూ.385.24 కోట్లు, ఉద్యానవన పంటలు రూ.108 కోట్లు, ఆక్వాకల్చర్ రూ.4.23 కోట్లు, పశుసంవర్ధక రూ.22.1 లక్షలు, పరిశ్రమలు రూ.34.43 లక్షలు, ఇరిగేషన్ రూ.506 కోట్లు, రోడ్లు భవనాలు రూ.69 కోట్లు, పంచాయతీరాజ్ రూ.60 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం రూ.51.40 కోట్లు, విద్యుత్ రూ.15 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలు రూ.2.03 కోట్లు కలిపి మొత్తం రూ.1200 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు.
ఛాయాచిత్ర ప్రదర్శన పరిశీలన:
సమావేశం ముగిసిన అనంతరం అంతర మంత్రిత్వ కేంద్ర అధికారుల బృందం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మ్యాప్ సహాయంతో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు, దెబ్బతిన్న వరి, పసుపు, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంద, అరటి, బొప్పాయి, తమలపాకు తదితర పంటల నష్టాన్ని వివరించారు.
అదేవిధంగా ధ్వంసమైన రహదారులు, రక్షిత మంచినీటి పథకాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ, పశువుల నష్టం, కట్టలు తెగిన చేపలు రొయ్యల చెరువులు, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు తదితర అంశాలను ఛాయాచిత్రాల ప్రదర్శనతో వరద నష్ట తీవ్రతను కేంద్ర అధికారుల బృందానికి వివరించారు.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు కలెక్టర్ తో పాటు పాల్గొన్నారు.