– పారదర్శకమైన నష్ట వివరాల నమోదుకు రీవెరిఫికేషన్
– ఈ నెల 15వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి.. వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని.. అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ (క్రాస్ చెక్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా. జి.సృజన శనివారం నగరంలోని సింగ్‌నగర్ వాంబే కాలనీ ప్రాంతంలో పర్యటించి నష్ట వివరాల డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు నష్టాల నమోదు ప్రక్రియను దాదాపు పూర్తిచేయడం జరిగిందన్నారు. ఏ కారణంచేతనైనా నష్టాల వివరాలు నమోదుకాని వారికి సంబంధిత సచివాలయాల ద్వారా మరో అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ బృందాలు పరిశీలించిన వివరాలను యాప్‌లో నమోదు చేయడం జరిగిందన్నారు. నష్ట వివరాలను నమోదుచేసి, నష్టపోయిన ప్రతి బాధితునికీ సాయమందించి వారిని కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ముంపునీటి కారణంగా నష్టపోయిన గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులతో పాటు మొదటి అంతస్తులో ఎలాంటి నష్టం జరిగినా.. అలాంటి వాటి వివరాలను కూడా సేకరించి, నివేదికలో పొందుపరచాలని ఎన్యూమరేషన్ బృందాలకు స్పష్టమైన సూచనలు చేయడం జరిగిందన్నారు. ముంపు కారణంగా దెబ్బతిన్న వాహనాలకు, ఇతర ఆస్తులకు ఇన్సూరెన్స్ పరిహారాన్ని అందించాలన్న లక్ష్యంతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ సెలవురోజులైన శని,ఆదివారాల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని, ఈ సెంటర్ తర్వాత కూడా యథాతథంగా సేవలందిస్తుందని, బాధితులు ఫెసిలిటేషన్ సెంటర్లో వారికి సంబంధించిన క్లెయిమ్‌లను సెటిల్‌చేసుకోవాలన్నారు. దాదాపు 20 ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు వారి పరిధిలో అప్పటికప్పుడే క్లెయిమ్‌లను సెటిల్ చేసి బాధితులకు సహకరించడం జరుగుతుందన్నారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, భవానీపురం, పాయకాపురం, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో మెప్మా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనుసంధానంతో అర్బన్ కంపెనీ యాప్ ద్వారా వివిధ సేవలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వివరించారు. మెప్మా ఆర్‌పీలు, సిబ్బంది వారి పరిధిలోని స్వయంసహాయక సంఘాల సభ్యుల ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి అవసరమైన సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చేస్తున్నామన్నారు. ఈ రిక్వెస్ట్‌ల ఆధారంగా టెక్నీయిషన్లు స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్, ఏసీ మెకానిక్, టీవీ టెక్నీషియన్ ఇలా వివిధ సేవలు అందిస్తున్నటు తెలిపారు. దాదాపు 200 మంది టెక్నీషియన్లు ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. అవసరం మేరకు బయట ప్రాంతాల నుంచి కూడా టెక్నీషియన్లను రప్పించి సేవలందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల విషయంలో ఆయా కంపెనీలు లేబర్ ఛార్జీల్లో పూర్తిగా, స్పేర్ పార్ట్స్‌లో 50 శాతం మేర రాయితీ కల్పిస్తూ సేవలందించేలా చేస్తున్నామని కలెక్టర్ సృజన వివరించారు.
కలెక్టర్ సృజన వెంట విజయవాడ నార్త్ తహశీల్దార్ సీహెచ్ శిరీషా దేవి, ప్రత్యేక అధికారులు ఎ.హరికృష్ణ, భారతి, ఆర్ఐ జి.వరప్రసాద్ తదితరులు ఉన్నారు.