-కూటమి ప్రభుత్వం వచ్చాక గుండ్లకమ్మకు రూ. 8 కోట్లు కేటాయించాం
-సాగు నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
-త్వరలోనే కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
వెల్లంపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. పులిచింతల, అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణలు అని మంత్రి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా వెల్లంపల్లి పొగాకు బోర్డుకు చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్… పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. పూర్తి స్థాయిలో రైతుల పంట కొనుగోలుకు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు రిపేరు పనులను స్థానిక రైతు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సాగు నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా జిల్లాలోని గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా నాటి వైసీపీ పాలకులు చోద్యం చూస్తూండిపోయారని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ. 8 కోట్ల నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తంతో ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. వైసీపీ నాయకులు గడిచిన మూడేళ్ల నుంచి గుండ్లకమ్మలో చుక్క నీరు కూడా నిలబెట్ట లేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 1.75 టీఎంసీలు నీళ్లు నిలబెట్టగలిగాం అని వెల్లడించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద ఉన్న కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులపై గొట్టిపాటి రవి కుమార్, సంబంధిత శాఖ మంత్రి రామానాయుడుతో ఫోన్ లో మాట్లాడారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి రామానాయుడు త్వరలోనే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పొగాకు బ్లేడ్లను పరిశీలించారు. లో గ్రేడ్ పోగాకును కూడా వెనక్కి పంపకుండా మొత్తం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాధ్యమైనంత వరకు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి సూచించారు.