-ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి లారీల యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే రవాణా కార్యకలాపాలు నిర్వహించేందుకు వారు అంగీకరించారు. మంగళవారం సచివాలయంలోని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సమక్షంలో చర్చలు నిర్వహించారు. గనుల , భూగర్భ శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ లారీ యజమానుల సంఘాలతో ఉదయం నుండి పలు ధఫాలుగా చర్చలు జరిపి, వారి అనుమానాలను నివృత్తి చేసారు. అనంతరం వారిని సచివాలయానికి తీసుకు వచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం కోసం లారీ యజమానులకు డిపాజిట్, అఫడవిట్ విధానం ప్రవేశ పెట్టగా, దాని నుండి మినహాయించాలని వారు కోరారు. దానికి ప్రభుత్వ పక్షాన మంత్రి రవీంద్ర అంగీకరిస్తూ దాని స్ధానంలో రిజిస్ట్రేషన్ విధానం అమలు అవుతుందన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలు పాటించవలసిందేనని, ఇందుకు అవసరమైన సవరణ మార్గదర్శకాలను బుధవారం జారీ చేస్తామన్నారు. అయితే రవాణా వ్యవహారాలు ఆటంకం కలుగరాదన్నారు. జిపిఎస్ అధారిత విధానం తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రభుత్వం నిర్ధేశించిన రవాణ చార్జీలను పాటించాలని, రిజిస్టేషన్ తప్పనిసరని ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసారన్నారు. ముఖ్యమంత్రి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన విధానానికి అంకురార్పణ చేసారన్నారు. యాప్ ద్వారా మాత్రమే ఎగుమతి అనుమతులు మంజూరు అవుతాయని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేసారు. తొలుత ప్రభుత్వ ఆలోచనా ధోరణికి అనుగుణంగా లారీ యజమానులు వ్యవహరించాలని సూచించారు. కొన్ని ప్రాంతాలలో మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి చిన్న చిన్న తప్పులకు సైతం భారీ జరిమానాలు విధించారని సంఘాల ప్రతినిధులు ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకురాగా, అన్ని జిల్లాల కలెక్టర్ లకు స్పష్టమైన సూచనలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రవాణా పరంగా గత రెండు, మూడు రోజలుగా ఏర్పడిన స్వల్ప అడ్డంకులు తొలిగిపోయాయని, బుధవారం నుండి పెండింగ్ లో ఉన్న ఇసుక లోడింగ్ ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.